India: 1971 తర్వాత తొలిసారి దేశవ్యాప్త మాక్‌డ్రిల్స్... అప్పుడు ఎలా నిర్వహించారంటే?

India Announces Nationwide Civil Defence Mock Drills After 5 Decades
  • యుద్ధ సన్నద్ధతలో భాగంగా భారత్‌లో భారీ పౌర రక్షణ డ్రిల్స్
  • పౌర రక్షణే లక్ష్యంగా దేశమంతటా మాక్‌డ్రిల్స్
  • కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో 259 కీలక ప్రాంతాల్లో ఈ డ్రిల్స్
దాదాపు ఐదు దశాబ్దాల విరామం తర్వాత దేశవ్యాప్తంగా పౌర రక్షణ మాక్‌డ్రిల్స్‌ను నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. 1971 యుద్ధం తర్వాత ఈ స్థాయిలో దేశమంతటా ఇలాంటి డ్రిల్స్ చేపట్టడం ఇదే మొదటిసారి. సంక్షోభ సమయాల్లో, ముఖ్యంగా గగనతల దాడుల వంటి విపత్కర పరిస్థితుల్లో పౌరుల ప్రాణాలను ఎలా కాపాడుకోవాలనే దానిపై అవగాహన కల్పించడం, యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడమే ఈ మాక్‌డ్రిల్స్ ముఖ్య ఉద్దేశ్యం. ఇందుకోసం దేశవ్యాప్తంగా 259 కీలక ప్రాంతాలను కేంద్ర హోం శాఖ ఎంపిక చేసింది.

గతంలో 1962, 1965, 1971 యుద్ధాల సమయంలో ఇలాంటి మాక్‌డ్రిల్స్ నిర్వహించారు. కార్గిల్ యుద్ధ సమయంలో కూడా డ్రిల్స్ జరిగినా, అవి కేవలం సరిహద్దు రాష్ట్రాలకే పరిమితమయ్యాయి. కానీ ఈసారి దేశవ్యాప్తంగా వీటిని చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.

1971లో ఏం జరిగిందంటే?

1971 నాటి అనుభవాలను సీనియర్ జర్నలిస్టు మధురేంద్ర ప్రసాద్ సిన్హా గుర్తుచేసుకుంటూ, యుద్ధానికి కొన్ని రోజుల ముందు డ్రిల్స్ ప్రారంభమై, పాకిస్థాన్ లొంగిపోయే వరకు కొనసాగాయని తెలిపారు.

"సాయంత్రం 6:30 గంటలకల్లా అందరూ ఇళ్లకు చేరుకునేవారు. సైరన్ మోగగానే లైట్లు ఆపేసి, సురక్షిత ప్రాంతాల్లో నిశ్శబ్దంగా దాక్కునేవాళ్లం" అని ఆయన వివరించారు. సైరన్ వినగానే నేలపై పడుకుని చెవులు గట్టిగా మూసుకునేవారమని ఆర్కే శర్మ అనే రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి తన అనుభవాలను పంచుకున్నారు.

అందుకే మాక్‌డ్రిల్స్

ఈ మాక్‌డ్రిల్స్‌లో భాగంగా పలు కీలక అంశాలను పరీక్షించనున్నారు. శత్రు విమానాలు, క్షిపణులు లేదా డ్రోన్‌ల దాడుల హెచ్చరిక వ్యవస్థల పనితీరును అంచనా వేయడం, వాయుసేనతో హాట్‌లైన్, రేడియో కమ్యూనికేషన్‌ను సిద్ధం చేసుకోవడం, కంట్రోల్ రూమ్‌ల సామర్థ్యాన్ని పరీక్షించడం వంటివి ఇందులో ఉన్నాయి. అలాగే, బ్లాక్‌అవుట్ (లైట్లు పూర్తిగా ఆపివేయడం) సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటి ప్రభావాన్ని అంచనా వేస్తారు.

పౌరులు, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు, హోంగార్డులు, సివిల్ డిఫెన్స్ వార్డెన్లు, నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ సభ్యులు ఈ డ్రిల్స్‌లో పాల్గొనాలని కేంద్రం పిలుపునిచ్చింది. సివిల్ డిఫెన్స్ సర్వీసుల (వార్డెన్ సేవలు, అగ్నిమాపక, సహాయక చర్యలు) స్పందనను, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రణాళికల పనితీరును కూడా ఈ డ్రిల్స్ ద్వారా పరిశీలిస్తారు.

అంతేకాకుండా, కీలకమైన పరిశ్రమలు, ప్రభుత్వ భవనాలు, సైనిక స్థావరాలు, విద్యుత్ కేంద్రాలు, కమ్యూనికేషన్ హబ్‌లను శత్రువుల ఉపగ్రహాలు, గగనతల నిఘా నుంచి దాచిపెట్టేందుకు కెమోఫ్లాజ్ (పరిసరాల్లో కలిసిపోయేలా రంగులు వేయడం లేదా కప్పడం) చేయడాన్ని కూడా సాధన చేయనున్నారు. 1971 యుద్ధ సమయంలో ఆగ్రాలోని ఖేరియా వైమానిక స్థావరం పాక్ లక్ష్యాల్లో ఒకటిగా ఉండటంతో, సమీపంలోని తాజ్‌మహల్‌కు హాని జరగకుండా ఆకుపచ్చటి వస్త్రంతో కప్పి ఉంచిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకోవచ్చు.
India
Civil Defence
Mock Drills
National Mock Drills
Air Raid Drills
1971 War
Madhurendra Prasad Sinha
RK Sharma
Civil Defence Services
National Security

More Telugu News