Balakrishna: రాయలసీమ గడ్డ నా అడ్డా... ఖబడ్దార్: వైసీపీకి బాలకృష్ణ మాస్ వార్నింగ్

Balakrishnas Strong Warning to YSRCP
  • టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని బాలయ్య హెచ్చరిక
  • ఏడాదిలోపే నియోజకవర్గంలో రూ. 50 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టానని వెల్లడి
  • టీడీపీ జవాబుదారీతనంతో పనిచేస్తుందని వ్యాఖ్య
రాయలసీమ గడ్డ తన అడ్డా అని... సీమ జోలికి వచ్చినా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోలికి వచ్చినా సహించేది లేదని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వైసీపీ నేతలను తీవ్రంగా హెచ్చరించారు. ఈరోజు హిందూపురం నియోజకవర్గంలో పర్యటించిన ఆయన, పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలకు ఖబడ్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు.

తన పర్యటనలో భాగంగా హిందూపురం మండలం ఇందిరమ్మ కాలనీలో పేదలకు ఇళ్ల పట్టాలను బాలకృష్ణ పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు హిందూపురం రెండో పుట్టినిల్లు లాంటిదని గుర్తు చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ప్రజలకు జవాబుదారీగా ఉంటుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక దార్శనికత కలిగిన నాయకుడని కొనియాడారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కూడా పూర్తి కాకముందే హిందూపురంలో రూ. 50 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేయించినట్లు బాలకృష్ణ తెలిపారు. నియోజకవర్గ ప్రజల తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం రూ.136 కోట్లతో సమగ్ర నివేదికలు సిద్ధం చేశామని వెల్లడించారు. త్వరలోనే మున్సిపాలిటీ పరిధిలో అధునాతన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 

1984లోనే ఎన్టీఆర్ ముందుచూపుతో తూముకుంట వద్ద పారిశ్రామిక వాడను ఏర్పాటు చేశారని, ఆ విషయాన్ని హిందూపురం ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. వీలైతే అభివృద్ధి పనుల్లో భాగస్వాములు కావాలని... విమర్శలు చేయడం మానుకోవాలని వైసీపీకి హితవు  పలికారు.

Balakrishna
Hindupur MLA
YCP
TDP
Rayalaseema
Andhra Pradesh Politics
NTR
Chandrababu Naidu
Development Projects
Rayalaseema Development

More Telugu News