Ambati Rambabu: సీమరాజా, కిర్రాక్ ఆర్పీలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అంబటి రాంబాబు

Ambati Rambabu Files Police Complaint Against Seema Raja Kirrak RP
  • ఐటీడీపీపై అంబటి రాంబాబు ఫైర్
  • తమపై తప్పుడు పోస్టులు పెడుతున్నారంటూ ఆగ్రహం
  • పోలీసులు చర్యలు తీసుకోకపోతే సుప్రీంకోర్టుకైనా వెళతామని స్పష్టం
  • ఆ కేసు తానే వాదిస్తానని వెల్లడి
తమ పార్టీపైనా, పార్టీ నేతలపైనా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న తప్పుడు ప్రచారంపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీకి వ్యతిరేకంగా అసత్యాలు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసులు తమ ఫిర్యాదులపై స్పందించని పక్షంలో న్యాయస్థానాలను ఆశ్రయించక తప్పదని హెచ్చరించారు. ఆ కేసును తానే వాదిస్తానని అన్నారు. నేడు గుంటూరులోని పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు సమర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగం (ఐటీడీపీ) తమ పార్టీపైనా, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపైనా, తనపైనా దుష్ప్రచారం చేస్తోందని అంబటి రాంబాబు ఆరోపించారు. ఈ మేరకు ఐటీడీపీపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీంతో పాటు, వైసీపీ కండువా వేసుకుని అసత్య ప్రేలాపనలు చేస్తున్నారని ఆరోపిస్తూ సీమ రాజా పైనా, మాజీ మంత్రి రోజా తదితరులపై అనుచిత వీడియోలు చేస్తున్నారంటూ కిర్రాక్ ఆర్పీ పైనా వేర్వేరుగా ఫిర్యాదులు చేసినట్లు వెల్లడించారు.

గతంలో తాము చేసిన ఫిర్యాదులపై పోలీసులు ఎటువంటి చర్యలూ చేపట్టలేదని అంబటి రాంబాబు విమర్శించారు. అందుకే ఈసారి ఫిర్యాదు చేసి, అందుకు సంబంధించిన రసీదును కూడా తీసుకున్నట్లు పేర్కొన్నారు. తమ ఫిర్యాదులను పోలీసులు పట్టించుకోవడం లేదని, కానీ టీడీపీ నేతలు ఫిర్యాదు చేస్తే మాత్రం వెంటనే స్పందించి తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం పోలీస్ వ్యవస్థ పూర్తిగా టీడీపీ నియంత్రణలో ఉందని వ్యాఖ్యానించారు.

సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ప్రోత్సాహంతోనే ఐటీడీపీ పేరుతో వైసీపీ నేతలపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని అంబటి ఆరోపించారు. ఈ వ్యవహారంలో బాధ్యులపై పోలీసులు చర్యలు తీసుకునేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. దోషులను చట్ట ప్రకారం శిక్షించే వరకు విశ్రమించబోమని, అవసరమైతే ఈ విషయంపై సుప్రీం కోర్టు వరకు వెళ్లేందుకైనా సిద్ధమని అన్నారు. పార్టీ తరపున తానే స్వయంగా వాదనలు వినిపిస్తానని తెలిపారు. సీమ రాజా, కిర్రాక్ ఆర్పీ లాంటి వారు చట్టం నుంచి తప్పించుకోలేరని, వారి వెనుక ఎంత పెద్దవారున్నా శిక్ష అనుభవించాల్సిందేనని అంబటి రాంబాబు పేర్కొన్నారు.
Ambati Rambabu
YCP
TDP
Social Media Defamation
Cyber Crime
Seema Raja
Kirrak RP
Police Complaint
Andhra Pradesh Politics
False Propaganda

More Telugu News