Ajay Bisaria: భారత్-పాక్ యుద్ధం వస్తే... నిపుణులు ఏమంటున్నారంటే...!

India Pakistan War Experts Opinions and Predictions
  • ప్రజల మానసిక స్థితి ఆధారంగా యుద్దాన్ని నిర్దేశించకూడదన్న మాజీ దౌత్యాధికారి అజయ్ బిసరియా
  • యుద్దమే అనివార్యమైతే సొంతంగానే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడి
  • యుద్దం వల్ల ఇరు దేశాలకు మూల్యం భారీగానే ఉంటుందన్న వ్యూహాత్మక వ్యవహారాల నిపుణుడు సుశాంత్ సరీన్
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రజానీకం పాక్ దుశ్చర్యపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తోంది. దేశంలో తీవ్ర భావోద్వేగాలు రగులుతున్నాయి. దెబ్బకు దెబ్బ తీయాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోపక్క పాక్‌పై భారత్ వరుస కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇస్తూ కీలక నిర్ణయం వెలువరించింది. ఈ తరుణంలో పాక్ - భారత్ మధ్య యుద్ధం వస్తే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనే దానిపై పలువురు నిపుణులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

ఈ అంశంపై 2017 నుంచి 2023 వరకు పాకిస్థాన్‌కు భారత హైకమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించిన అజయ్ బిసారియా మాట్లాడుతూ.. ప్రజల మానసిక స్థితి ఆధారంగా పాకిస్థాన్‌తో యుద్ధాన్ని నిర్దేశించకూడదని అన్నారు. ప్రజాభిప్రాయం ఆధారంగా యుద్ధం యొక్క సమయం ఉండకూడదని పేర్కొన్నారు. ఏ ఆపరేషన్ విజయవంతం కావాలన్నా వేగం, అనూహ్యత, గోప్యత అనేవి చాలా ప్రధానమైనవని బిసారియా చెప్పారు.

యుద్ధమే అనివార్యమైతే సొంతంగానే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, సొంత నిర్ణయంతోనే యుద్ధం చేయాలని బిసారియా అన్నారు. అప్పుడు ఎంత తీవ్ర పరిస్థితినైనా ఎదుర్కోవాల్సి వస్తుందని, అదుపు తప్పితే పూర్తి స్థాయి యుద్ధం చేయాల్సి వస్తుందని అన్నారు. అందుకు తగిన సామర్థ్యం, పట్టుదల, రాజకీయ సంకల్పం, జాతి సంకల్పం కావాలని ఆయన విశ్లేషించారు.

వ్యూహాత్మక వ్యవహారాల నిపుణుడు సుశాంత్ సరీన్ మాట్లాడుతూ.. యుద్ధం వల్ల మూల్యం కూడా భారీగానే ఉంటుందని హెచ్చరించారు. ఇరుదేశాలు ఒకరిపై మరొకరు క్షిపణులతో దాడికి దిగే పరిస్థితి ఏర్పడితే అది ఆయా దేశాల్లోని నగరాలపై ప్రభావం చూపుతుందని అన్నారు.

నగరాలపై క్షిపణుల వర్షం కురిస్తే ఇటు ఇస్లామాబాద్, లాహోర్‌పై, అటు ఢిల్లీపై ఆ ప్రభావం పడుతుందని సరీన్ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌కు భాగస్వామిగా ఉన్న రష్యా బాసటగా నిలిచే అవకాశం ఉండకపోవచ్చని అన్నారు. పాక్ యూట్యూబ్ ఛానెళ్ల ప్రసారాలను భారత్ నిలిపివేయడం ప్రస్తుత పరిస్థితుల్లో సమర్థనీయమేనని పేర్కొన్నారు. 
Ajay Bisaria
Sushant Sareen
India-Pakistan War
Nuclear War
India Pakistan Conflict
Pakistan Terrorism
Geopolitics
International Relations
South Asia

More Telugu News