Boma Akhila Priya: నాపై నిరాధార ఆరోపణలు.. భూమా అఖిలప్రియ

Boma Akhila Priya Condemns False Allegations
  • ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్
  • అహోబిలంలో అక్రమ నిర్మాణాలను కూల్చేందుకు సిద్ధమని వెల్లడి
  • ఆళ్లగడ్డలో చికెన్ వ్యాపారం గురించి అవాస్తవ కథనాలు రాస్తున్నారని ఫైర్
వైసీపీ నాయకులు తనపై నిరాధార, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తీవ్రంగా మండిపడ్డారు. ఓ దినపత్రికలో తనపై తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను బీట్యాక్స్ వసూలు చేస్తున్నానని కథనాలు ప్రచురించారని విమర్శించారు. తనపై వచ్చిన ఆరోపణలపై చర్చకు సిద్ధమని ఆమె స్పష్టం చేశారు. ఆరోపణలు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ఆమె సవాల్ విసిరారు. ఈ మేరకు శనివారం నంద్యాలలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో అఖిలప్రియ మీడియాతో మాట్లాడారు. అహోబిలంలో అక్రమంగా సత్రాలు, హోటళ్లు నిర్మిస్తున్నారని, వాటికి తాను అనుమతిచ్చానని ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ పత్రిక రాసిందని తెలిపారు.

అయితే, అహోబిలం సర్పంచ్ వైసీపీ నేత అని ఆమె గుర్తుచేశారు. గ్రామ పరిధిలో నిర్మాణాలు చేపట్టాలంటే సర్పంచ్ అనుమతి, గ్రామ పంచాయతీ తీర్మానం అవసరమనే విషయం వైసీపీ నేతలు మర్చిపోయారని చెప్పారు. అక్రమాలకు పాల్పడింది వైసీపీ నేతలైతే తనపై తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని అఖిలప్రియ మండిపడ్డారు. అహోబిలంలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చేందుకు తాను సిద్ధమని, వైసీపీ వాళ్లు కూడా సిద్ధమేనా అని నిలదీశారు. ఇక ఆళ్లగడ్డలోనూ చికెన్ వ్యాపారంపై అవాస్తవాలతో కథనాలు ప్రచురించారని అఖిలప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Boma Akhila Priya
Andhra Pradesh Politics
YCP
TDP
Allagaadda MLA
False Allegations
Media Controversy
Illegal Constructions
Ahobilam
Nandyala

More Telugu News