Sundar Pichai: 2024లో సుందర్ పిచాయ్ ప్యాకేజి బాగా తగ్గింది... కారణం ఇదే!

Sundar Pichais 2024 Pay Package Significantly Reduced
  • ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ 2024 వేతనం 10.72 మిలియన్ డాలర్లు
  • 2022 (226 మిలియన్ డాలర్లుతో పోలిస్తే గణనీయమైన తగ్గుదల
  • మూడేళ్లకోసారి ఇచ్చే స్టాక్ అవార్డు ఈసారి లేకపోవడంమే తగ్గుదలకు కారణం
టెక్ దిగ్గజం గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్, తమ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) సుందర్ పిచాయ్‌కి 2024 సంవత్సరానికి గాను చెల్లించిన వేతన ప్యాకేజీ వివరాలను తాజాగా వెల్లడించింది. కంపెనీ విడుదల చేసిన 2025 ప్రాక్సీ స్టేట్‌మెంట్ ప్రకారం, పిచాయ్ మొత్తం వార్షిక పారితోషికం 10.72 మిలియన్ డాలర్లుగా (సుమారు రూ. 89 కోట్లు) నమోదైంది. ఇది 2022లో ఆయన అందుకున్న 226 మిలియన్ డాలర్ల భారీ ప్యాకేజీతో పోలిస్తే గణనీయంగా తక్కువ కావడం గమనార్హం.

వేతనంలో కోతకు కారణం ఇదే

సుందర్ పిచాయ్ వేతన ప్యాకేజీలో ఈసారి ఇంత పెద్ద తగ్గుదల కనిపించడానికి ప్రధాన కారణం ఉందని ఆల్ఫాబెట్ తమ ప్రకటనలో స్పష్టం చేసింది. గతంలో ఆయనకు అందిన భారీ మొత్తంలో ప్రతి మూడేళ్లకోసారి ఇచ్చే స్టాక్ అవార్డు కీలక పాత్ర పోషించింది. అయితే, 2024లో ఆ తరహా పెద్ద స్టాక్ అవార్డు ఏదీ లేకపోవడంతో మొత్తం ప్యాకేజీ విలువ గణనీయంగా తగ్గింది. అయినప్పటికీ, ఆయన మూల వేతనం (బేసిక్ శాలరీ) మాత్రం స్థిరంగా 2 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 16.6 కోట్లు) గానే కొనసాగింది. మిగిలిన మొత్తం సుమారు 8.72 మిలియన్ డాలర్లు స్టాక్ అవార్డులు మరియు ఇతర అలవెన్సుల రూపంలో ఉన్నాయి.

భద్రతా వ్యయంలో భారీ పెరుగుదల

పిచాయ్ మొత్తం వేతన ప్యాకేజీ తగ్గినా, ఆయన వ్యక్తిగత భద్రత కోసం కంపెనీ చేస్తున్న ఖర్చు మాత్రం భారీగా పెరిగింది. 2024లో సుందర్ పిచాయ్ వ్యక్తిగత భద్రత నిమిత్తం ఆల్ఫాబెట్ ఏకంగా 8.27 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 69 కోట్లు) ఖర్చు చేసినట్లు ప్రాక్సీ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. ఇది 2023లో వెచ్చించిన 6.78 మిలియన్ డాలర్లతో పోలిస్తే దాదాపు 22 శాతం అధికం. పిచాయ్ 2024లో ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి రావడం వల్లే భద్రతా ఏర్పాట్లు, సంబంధిత ఖర్చులు పెరిగినట్లు తెలుస్తోంది.

భద్రతా ఖర్చులపై కంపెనీ వివరణ

ఈ భద్రతా ఏర్పాట్లపై కంపెనీ తమ ప్రకటనలో మరింత వివరణ ఇచ్చింది. "2024లో సుందర్ పిచాయ్ భద్రతా ఏర్పాట్లలో నివాస భద్రత, కన్సల్టేషన్ ఫీజులు, సెక్యూరిటీ మానిటరింగ్ సేవలు, కారు మరియు డ్రైవర్ సేవలు, అలాగే అన్ని ప్రయాణాల్లో వ్యక్తిగత భద్రత వంటివి ఉన్నాయి" అని తెలిపింది. 

"ఈ ఏర్పాట్లు, ఖర్చులు సహేతుకమైనవి, అవసరమైనవి మరియు ఆల్ఫాబెట్, దాని వాటాదారుల ప్రయోజనాలకు అనుకూలమైనవని మేము విశ్వసిస్తున్నాము. ఇవి మా వ్యాపారానికి ఎదురయ్యే ప్రమాదాలను తగ్గించడంలో సహాయపడతాయి" అని కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా, ఈ అదనపు భద్రతా ఏర్పాట్లను పిచాయ్‌కు వ్యక్తిగత ప్రయోజనంగా పరిగణించడం లేదని, ఎందుకంటే అవి ఆయన ఉద్యోగ బాధ్యతల రీత్యా కల్పించామని కంపెనీ స్పష్టం చేసింది.
Sundar Pichai
Google CEO
Alphabet Inc.
Salary Package
Stock Awards
Compensation
Security Expenses
Travel Expenses
Executive Pay
Tech Industry

More Telugu News