Kishan Reddy: తెలంగాణలో 33 జిల్లాలకు గాను 32 జిల్లాల మీదుగా జాతీయ రహదారులు వెళుతున్నాయి: కిషన్ రెడ్డి

Telanganas National Highway Network Expands Under Modi Government Kishan Reddy
  • గత పదేళ్లలో తెలంగాణలో జాతీయ రహదారుల పొడవు రెట్టింపు
  • 2,500 కి.మీ నుంచి 5,200 కి.మీకి పెరిగిన జాతీయ రహదారులు
  • రహదారుల అనుసంధానానికి మోదీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత
  • హైదరాబాద్-శ్రీశైలం, విజయవాడ మార్గాల విస్తరణకు ప్రణాళికలు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత పదేళ్లలో తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణం వేగవంతం చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రహదారుల అభివృద్ధికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.

గత దశాబ్ద కాలంలో తెలంగాణలో జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. 2014 నాటికి తెలంగాణలో కేవలం 2,500 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు ఉండగా, ప్రస్తుతం వాటి పొడవు 5,200 కిలోమీటర్లకు చేరుకుందని వెల్లడించారు. రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాలకు గాను, 32 జిల్లాల మీదుగా ఇప్పుడు జాతీయ రహదారులు వెళుతున్నాయని తెలిపారు. రహదారుల అభివృద్ధి జరిగితేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని, అనుసంధానం అత్యంత కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా వాజ్‌పేయి హయాంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘స్వర్ణ చతుర్భుజి’ పథకాన్ని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. అయితే, 2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్ల నిర్మాణంపై లక్షల కోట్ల రూపాయల ఖర్చు ఎందుకంటూ విమర్శించి, ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లలేదని ఆరోపించారు. ప్రస్తుత మోదీ ప్రభుత్వం రహదారుల అనుసంధానం కోసం అధిక నిధులు కేటాయిస్తోందని, పెట్టుబడులు ఆకర్షించే అవకాశం ఉన్న అన్ని ప్రాంతాలకు రోడ్డు మార్గాలను నిర్మిస్తున్నామని అన్నారు.

తెలంగాణలో రింగ్ రోడ్ల అభివృద్ధి పనులు కూడా జరుగుతున్నాయని కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్-శ్రీశైలం మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నామని, అలాగే హైదరాబాద్-విజయవాడ మధ్య ఆరు లైన్ల రహదారి నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన వివరించారు.
Kishan Reddy
Telangana National Highways
National Highway Development
Modi Government
Road Infrastructure
Telangana Road Projects
Highway Expansion
Telangana Connectivity
Hyderabad-Vijayawada Highway
Ring Roads Telangana

More Telugu News