Virat Kohli: ఐపీఎల్ తొలినాళ్లలో కోహ్లీ రేటెంతో తెలుసా?

Virat Kohlis Early IPL Days A Look Back
  • ఐపీఎల్ తొలి సీజన్ జ్ఞాపకాలు గుర్తుచేసుకున్న విరాట్ కోహ్లీ
  • కోహ్లీని రూ. 20 లక్షలకు ఆర్‌సీబీ కొనుగోలు
  • ఆ సమయంలో తాను మలేషియాలో ఉన్నట్టు కోహ్లీ వెల్లడి
  • ఐపీఎల్ ఇంత పెద్ద స్థాయికి చేరుకుంటుందని ఊహించలేదని ఆశ్చర్యం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టోర్నీ తొలినాళ్ల జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు. తాను ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన ప్రారంభ దినాలను, ముఖ్యంగా తొలి వేలంలో కేవలం రూ. 20 లక్షల ధరకే ఆర్‌సీబీ ఫ్రాంచైజీ తనను కొనుగోలు చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు.

జియోహాట్‌స్టార్ నిర్వహించిన '18 కాలింగ్ 18' షోలో కోహ్లీ మాట్లాడుతూ, ఐపీఎల్ తొలి వేలం జరిగినప్పుడు తాను మలేషియాలోని కౌలాలంపూర్‌లో ఉన్నానని తెలిపాడు. "ఐపీఎల్ మొదటి సంవత్సరం చాలా ఉత్సాహంగా గడిచింది. ఊహించని ఎన్నో విషయాలు జరిగాయి. అప్పటికి మాకు టీ20 క్రికెట్ ఆడిన అనుభవం పెద్దగా లేదు. ఫ్రాంచైజీ క్రికెట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న గొప్ప ఆటగాళ్లతో కలిసి ఆడే అవకాశం లభించింది. మేం ఎంతో ఆరాధించే ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం గొప్ప అనుభవం" అని కోహ్లీ వివరించాడు.

తొలి వేలం గురించి మాట్లాడుతూ, "వేలం జరిగినప్పుడు మేం మలేషియాలో ఉన్నాం. ఫస్ట్-క్లాస్ క్రికెటర్ల కోటాలో మమ్మల్ని గరిష్టంగా రూ. 20 లక్షలకే కొనుగోలు చేశారు. ఆ విషయం తెలియగానే కారిడార్‌లో మేమంతా 'మనకు రూ. 20 లక్షలు వచ్చాయ్!' అంటూ తెగ సంబరపడిపోయాం. అదో గొప్ప భావోద్వేగం. ఎందుకంటే అసలేం ఆశించాలో మాకు తెలియదు. ఐపీఎల్ ప్రారంభోత్సవం, గొప్ప క్రికెటర్లను కలవడం.. అదంతా మాటల్లో చెప్పలేని అనుభూతి" అని కోహ్లీ గుర్తు చేసుకున్నాడు.

గడిచిన 18 ఏళ్లలో ఐపీఎల్ అద్భుతమైన రీతిలో అభివృద్ధి చెందిందని కోహ్లీ ప్రశంసించాడు. "ఇదొక సుదీర్ఘ ప్రయాణం. ఈ లీగ్ ఎలా పెరిగిందో, ఎలా అభివృద్ధి చెందిందో, ఇంత గొప్ప వేదికగా ఎలా మారిందో మేం చూశాం. నిజం చెప్పాలంటే, ఐపీఎల్ ప్రారంభమైనప్పుడు ఇది ఇంత స్థాయికి చేరుకుంటుందని నేను అస్సలు ఊహించలేదు. కానీ 18 ఏళ్లుగా విజయవంతంగా సాగుతోంది. ప్రతి సంవత్సరం అంతే ఉత్సాహం, అంతకంటే ఎక్కువ ఆసక్తి కనిపిస్తుంది. దీనికి లీగ్ నిర్వాహకులు, జట్లు, పోటీతత్వం, వృత్తి నైపుణ్యమే కారణం. అన్నీ అత్యున్నత స్థాయిలో ఉన్నాయి" అని ఆయన పేర్కొన్నారు. 

కాగా, ఐపీఎల్ 2025లో కోహ్లీ రూ.21 కోట్లు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. రూ.20 లక్షలతో మొదలై, రూ.21 కోట్లు తీసుకునే స్థాయికి చేరడం వెనుక కోహ్లీ కృషి అసామాన్యం. అందుకు అతడి గణాంకాలే నిదర్శనం.
Virat Kohli
IPL
IPL Auction
RCB
Royal Challengers Bangalore
IPL History
Kohli IPL Price
T20 Cricket
Indian Premier League
Cricket

More Telugu News