Jagan Mohan Reddy: మీరు కనీసం వారివైపు కన్నెత్తికూడా చూడకపోవడం ధర్మమేనా?: జగన్

Jagans Scathing Criticism of AP Govts Farmer Policies
  • రైతుల కష్టాలు పట్టవా? అంటూ ప్రభుత్వంపై జగన్ ఫైర్
  • ప్రభుత్వం  మార్కెట్లో జోక్యం చేసుకోవడం లేదని విమర్శ
  • మిర్చి కొనుగోలు విషయంలో ప్రభుత్వం రైతులను మోసం చేసిందంటూ ఆగ్రహం
రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) లభించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం వారి గోడును పట్టించుకోవడం లేదని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. అన్నదాతలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నా, ప్రభుత్వ యంత్రాంగం కనీసం స్పందించకపోవడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబును ఉద్దేశించి ట్వీట్ చేశారు.

"చంద్రబాబు గారూ… కనీస మద్దతు ధరలు లభించక రాష్ట్రంలో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా వారి గోడు పట్టించుకోవడం లేదు. కనీస మద్దతు ధరలు లభించక, పెట్టిన పెట్టుబడులూ రాక రైతులు అప్పుల ఊబిలోకి కూరుకు పోతున్నారు. మీరు, మీ మంత్రులు, యంత్రాంగం కనీసం వారివైపు కన్నెత్తికూడా చూడకపోవడం ధర్మమేనా? 

మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, వేరుశెనగ, టమోటా, అరటి, చీని, పొగాకు ఇలా ఏ పంట చూసినా కనీస మద్దతు ధరలు రావడం లేదు. చొరవ చూపి, మార్కెట్లో జోక్యం చేసుకోవాలన్న కనీస బాధ్యతను విస్మరించారు. పైగా డ్రామాలతో ఆ రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. ఇది న్యాయమేనా? 

చంద్రబాబు గారూ... మిర్చి విషయంలో కూడా మీరు రైతులను నమ్మించి మోసం చేశారు. మిర్చి కొనుగోలు అంశం కేంద్రం పరిధిలో లేకపోయినా, నాఫెడ్‌ కొనుగోలు చేస్తుందని మొదట నమ్మబలికారు. క్వింటాలు రూ.11,781కు కొంటామని చెప్పి, ఒక్కపైసా కూడా ఖర్చు పెట్టకుండా, ఒక్క రైతు నుంచి కాని, ఒక్క ఎకరాకు సంబంధించి కాని, ఒక్క క్వింటాల్‌ గాని కొనకుండా అన్నం పెట్టే రైతులకు సున్నం రాశారు. 

మా హయాంలో ధరల స్థిరీకరణ నిధి కింద రూ.3 వేల కోట్లు పెట్టి, ఐదేళ్లలో రూ.7, 796 కోట్లు ఖర్చుచేశాం. చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని కనీస మద్దతు ధరల జాబితాలో లేని పొగాకు సహా అనేక పంటల రైతులను ఆదుకున్నాం. మీరు కొత్తగా ఏమీ చేయకపోయినా, కనీసం మా విధానాన్ని కొనసాగించి ఉంటే రైతులకు ఊరట లభించేది కదా? పైగా ఈ ఏడాది బడ్జెట్లో రూ.300 కోట్లు కేటాయించడం దారుణం కాదా? ఇందులో కూడా కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టిన దాఖలాలు ఉన్నాయా? 

ధాన్యం, కోకో, పొగాకు, ఆక్వా రైతులు ఆయా జిల్లాల్లో ఆందోళనలు చేస్తుంటే, ఇప్పటికీ రోమ్‌ చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా వ్యవహరిస్తున్నారు. జనాభాలో 60శాతం మంది ప్రజలు ఆధారపడే వ్యవసాయరంగాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల అది తీవ్ర సంక్షోభానికి దారితీస్తే, లక్షల మంది ఉపాధికి గండిపడితే దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? వెంటనే ప్రభుత్వం తరఫున మార్కెట్లో జోక్యం చేసుకోవాలని, కనీస ధరలు లభించని పంటల విషయంలో ప్రభుత్వమే జోక్యంచేసుకుని, మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాను" అంటూ జగన్ స్పష్టం చేశారు. 
Jagan Mohan Reddy
Andhra Pradesh Farmers
MSP
Minimum Support Price
Agriculture Crisis
Chandrababu Naidu
Farmer Protests
Crop Prices
Market Intervention
Agriculture in Andhra Pradesh

More Telugu News