సర్జికల్ స్ట్రైక్స్ పై సాక్ష్యాలేవి? కాంగ్రెస్ ఎంపీ ప్రశ్న.. పాక్ వెళ్లి చెక్ చేసుకొమ్మన్న బీజేపీ
- సీడబ్ల్యూసీ సమావేశం అనంతరం చరణ్ జిత్ సింగ్ చన్నీ వ్యాఖ్యలపై దుమారం
- విమర్శలు వ్యక్తం కావడంతో మాటమార్చిన చన్నీ
- సర్జికల్ స్ట్రైక్స్ పై తాను సాక్ష్యాలు అడగలేదని వివరణ
చరణ్ జిత్ సింగ్ చన్నీ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్ మరోసారి సైన్యాన్ని, వైమానిక దళాన్ని కించపరుస్తోందని బీజేపీ నేత మంజిందర్ సింగ్ సిర్సా విమర్శించారు. సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయని పాకిస్తానే అంగీకరించినా, కాంగ్రెస్ మాత్రం సైన్యం అబద్ధం చెబుతోందని ఆరోపిస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలకు అనుమానం ఉంటే పాకిస్థాన్ వెళ్లి చూసుకోవాలని ఎద్దేవా చేశారు. పహల్గామ్ లో ఉగ్రదాడి జరిగిన సమయంలో ఇలాంటి రాజకీయాలు చేయడం సరికాదని ఆయన అన్నారు. బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ కూడా కాంగ్రెస్ పాక్ ఉగ్రవాదాన్ని సమర్థిస్తోందని, సైన్యం స్థైర్యాన్ని దెబ్బతీస్తోందని ఆరోపించారు.
అయితే, ఆ తర్వాత చన్నీ తన వ్యాఖ్యలపై స్పష్టత ఇచ్చారు. తాను సర్జికల్ స్ట్రైక్స్‌పై ఎలాంటి ఆధారాలు అడగలేదని అన్నారు. ఈ క్లిష్ట సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అండగా ఉంటుందని, పాకిస్థాన్‌పై ఎలాంటి చర్యలు తీసుకున్నా మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. బాధితుల కుటుంబాలకు, దేశానికి న్యాయం జరగాలని కోరుకుంటున్నామని, ప్రభుత్వానికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు.