Virat Kohli: న‌న్ను అత‌డు బాగా ప్ర‌భావితం చేశాడు.. నేను ఈరోజు ఇలా ఆడుతున్నానంటే కార‌ణం అదే: కోహ్లీ

Mark Bouchers Influence on My Career says Virat Kohli
  • తాజాగా ఆర్‌సీబీ నిర్వ‌హించిన ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న‌ కోహ్లీ
  • త‌న క్రికెట్‌ కెరీర్ గురించి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను పంచుకున్న విరాట్‌
  • ప్ర‌ధానంగా త‌న‌ను బాగా ప్ర‌భావితం చేసిన మాజీ క్రికెట‌ర్ మార్క్ బౌచ‌ర్‌ ప్ర‌స్తావ‌న‌
ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) ప్రారంభం నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 18 ఏళ్ల పాటు విరాట్ కోహ్లీ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్‌సీబీ)కే ప్రాతినిధ్యం వహిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే, ఇప్ప‌టివ‌రకు ఆ జ‌ట్టు ఒక్క ఐపీఎల్ టైటిల్ కూడా గెల‌వ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. కోహ్లీ కెప్టెన్సీలో కూడా ఆర్‌సీబీ ట్రోఫీ గెలవ‌లేక‌పోయింది. అయితే, ఈసారి మాత్రం బెంగ‌ళూరు క‌సిమీద క‌నిపిస్తోంది. కొత్త కెప్టెన్ ర‌జ‌త్ పటిదార్ సార‌థ్యంలో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకుంటోంది. చూడాలి ఈసారి ఐపీఎల్ టైటిల్‌ గెలుస్తుందేమో. 

అయితే, తాజాగా ఫ్రాంచైజీ నిర్వ‌హించిన ఓ పాడ్‌కాస్ట్‌లో కింగ్ కోహ్లీ పాల్గొన్నాడు. ఈ సంద‌ర్భంగా త‌న క్రికెట్‌ కెరీర్ గురించి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను పంచుకున్నాడు. దీనికి సంబంధించిన 3.50 నిమిషాల నిడివి క‌లిగిన ట్రైల‌ర్‌ను ఆర్‌సీబీ త‌న అధికారిక 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) ఖాతా ద్వారా అభిమానుల‌తో పంచుకుంది. ఇందులో ప్ర‌ధానంగా త‌న‌ను బాగా ప్ర‌భావితం చేసిన ఓ మాజీ క్రికెట‌ర్ గురించి ర‌న్ మెషీన్ వివ‌రించాడు. 

"నేను ఇప్ప‌టివ‌ర‌కు క‌లిసి ఆడిన ఆటగాళ్ల‌లో అంద‌రి క‌న్నా నా మీద ద‌క్షిణాఫ్రికా మాజీ క్రికెట‌ర్ మార్క్ బౌచ‌ర్ ప్ర‌భావం అధికంగా ఉంది. నేను అడ‌గ‌కుండానే అత‌డు నాకు ఎన్నో విలువైన స‌ల‌హాలు, సూచ‌న‌లు చేస్తుండేవాడు. నేను భ‌విష్య‌త్తులో అద్భుతంగా రాణిస్తాన‌ని ముందే ఊహించిన‌వారిలో అత‌డు ఒక‌డు. 

త‌ను వ్యాఖ్యాత‌గా మారేనాటికి నేను క‌చ్చితంగా భార‌త జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హిస్తాన‌ని చెబుతుండేవాడు. నిత్యం న‌న్ను ప్రోత్సహిస్తూ ఉండేవాడు. ఈరోజు నేను ఇలా ఆడుతున్నానంటే ఒక‌ర‌కంగా అత‌డు కూడా ఒక కార‌ణం. అతడు నాతో జ‌రిపే సంభాష‌ణ‌లు నాలో ఎప్పుడూ ఎంతో ప్రేర‌ణ‌ను క‌లిగిస్తుండేవి" అని కోహ్లీ గ‌త జ్ఞాప‌కాల‌ను గుర్తు చేసుకున్నాడు. 

కాగా, ఈ సౌతాఫ్రికన్ మాజీ వికెట్ కీప‌ర్‌, బ్యాట‌ర్ ఐపీఎల్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్‌కు ప్రాతినిధ్యం వ‌హించిన విష‌యం తెలిసిందే. ఆర్‌సీబీ త‌ర‌ఫున మార్క్‌ బౌచ‌ర్ 2008 నుంచి 2010 వ‌ర‌కు ఆడాడు. 27 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన అత‌డు 29.85 స‌గ‌టుతో 388 ర‌న్స్ చేశాడు. ఇందులో ఒక హాఫ్ సెంచ‌రీ కూడా ఉంది.    
Virat Kohli
Mark Boucher
Royal Challengers Bangalore
RCB
IPL
Cricket
Podcast
King Kohli
South African Cricketer
Inspirational Story

More Telugu News