Revanth Reddy: ఆర్టీసీని కాపాడుకునే బాధ్యత మీదే: రేవంత్ రెడ్డి

Revanth Reddys Appeal to TSRTC Employees
  • సమ్మె విరమించుకోవాలని ఆర్టీసీ కార్మికులకు రేవంత్ విన్నపం
  • ఆర్టీసీ క్రమంగా లాభాల బాట పడుతోందన్న సీఎం
  • సమ్మె వల్ల రాష్ట్రానికి నష్టం వాటిల్లుతుందని వ్యాఖ్య
మే డే ఉత్సవాల వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీఎస్‌ఆర్టీసీ కార్మికులకు కీలక విజ్ఞప్తి చేశారు. సంస్థ ఇప్పుడిప్పుడే ఆర్థికంగా కోలుకుంటున్న తరుణంలో, సమ్మె ఆలోచనను విరమించుకోవాలని ఆయన కార్మికులను కోరారు.

"ఆర్టీసీ సంస్థ క్రమంగా లాభాల బాట పడుతోంది. ఇది మీ అందరి సంస్థ. దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది" అని ఆయన అన్నారు. కార్మికులు పంతాలు, పట్టింపులకు పోకుండా సంయమనం పాటించాలని హితవు పలికారు.

ఏవైనా సమస్యలు ఉంటే, వాటిని సంబంధిత మంత్రి దృష్టికి తీసుకువచ్చి, చర్చల ద్వారా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. సంస్థకు లభించే ఆదాయం విషయంలో పూర్తి పారదర్శకత పాటిస్తామని స్పష్టం చేశారు. "వచ్చే ఆదాయమంతా మీ చేతిలోనే పెడతాం. దానిని ఎలా ఖర్చు చేయాలో మీరే సూచించండి. అణా పైసా కూడా నేను ఇంటికి తీసుకెళ్లను. అంతా మీ కోసమే ఖర్చు చేస్తాం" అని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

అదే సమయంలో, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం ఆశాజనకంగా లేదని సీఎం గుర్తుచేశారు. "గత పదేళ్లలో రాష్ట్రంలో విధ్వంసం, ఆర్థిక దోపిడీ జరిగాయి. ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది. మరో ఏడాదిలో కొంత మెరుగవుతుంది. ఈ తరుణంలో సమ్మెకు దిగడం వల్ల రాష్ట్రానికి నష్టం వాటిల్లుతుంది. దయచేసి ఆలోచించండి" అని ఆయన విజ్ఞప్తి చేశారు. గతంలో ఏమీ చేయని వారు ఇప్పుడు తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేయవచ్చని, వారి మాటలు నమ్మవద్దని కార్మికులను హెచ్చరించారు.

"కష్టమైనా, నిష్ఠూరమైనా ఉన్నది ఉన్నట్టు చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. ఆర్టీసీ కార్మికులు నన్ను నమ్మండి. నమ్ముకున్న మీకు నేను అండగా ఉంటాను" అని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.
Revanth Reddy
TSRTC
Telangana
RTC Employees
Strike
Financial Crisis
May Day
Telangana RTC
Public Transport
State Finances

More Telugu News