Pawan Kalyan: శ్రామికులందరికీ రూ. 3 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు ఉచిత ప్రమాద బీమా సౌకర్యం: పవన్ కల్యాణ్

Pawan Kalyans Initiatives for Laborers Welfare in Andhra Pradesh
  • మేడే సందర్భంగా శ్రామికులతో పవన్ ముఖాముఖి
  • కూలీలను ఇకపై ‘ఉపాధి శ్రామికులు’గా పిలవాలని సూచన
  • పని ప్రదేశంలో మరణిస్తే పరిహారం రూ. 50 వేల నుంచి రూ. 2 లక్షలకు పెంచుతున్నామని ప్రకటన
దేశ నిర్మాణంలో శ్రామికుల పాత్ర అత్యంత కీలకమని, వారు లేకపోతే అభివృద్ధి సాధ్యం కాదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. కార్మిక దినోత్సవం (మేడే) పురస్కరించుకుని ఈరోజు ఆయన శ్రామికులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ, శ్రామికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు.

ఇకపై కార్మికులను 'కూలీలు' అని కాకుండా 'ఉపాధి శ్రామికులు' అని గౌరవంగా సంబోధించాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. కష్టపడి పనిచేసే వారికే అత్యధిక గౌరవం దక్కాలని అన్నారు. 'డిగ్నిటీ ఆఫ్ లేబర్' అనేది చాలా ముఖ్యమని, కండలు కరిగించి పనిచేసే శ్రామికులు లేకపోతే దేశంలో ఎలాంటి ప్రగతి ఉండదని చెప్పారు. తాము ఓట్ల కోసం కాకుండా సేవా దృక్పథంతో పనిచేస్తున్నామని, మూగజీవాల దాహార్తిని తీర్చడానికి కూడా పంచాయతీరాజ్ శాఖ చర్యలు చేపట్టిందని తెలిపారు.

ఉపాధి హామీ పథకం కింద పనిచేసే శ్రామికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని పవన్ కల్యాణ్ అన్నారు. ఇందులో భాగంగా, పని ప్రదేశంలో ప్రమాదవశాత్తూ మరణించిన ఉపాధి శ్రామికుడి కుటుంబానికి అందించే పరిహారాన్ని రూ. 50 వేల నుంచి రూ. 2 లక్షలకు పెంచుతున్నట్లు కీలక ప్రకటన చేశారు. అంతేకాకుండా, ఉపాధి శ్రామికులందరికీ రూ. 3 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు ఉచిత ప్రమాద బీమా సౌకర్యం కల్పించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించారు.

ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఉపాధి హామీ పనుల వేళల్లో మార్పులు సూచించారు. పనులను ఉదయం 11 గంటలలోపే ముగించాలని, అవసరమైతే సాయంత్రం 4 గంటల తర్వాత తిరిగి ప్రారంభించాలని తెలిపారు. గ్రామాల్లో ఉపాధి శ్రామికుల కోసం ఏఎన్ఎంల సేవలు, ప్రాథమిక వైద్య సదుపాయాలు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.

గ్రామీణాభివృద్ధికి పంచాయతీరాజ్ నిధులు కీలకమని పేర్కొంటూ, గత ఆర్థిక సంవత్సరంలో రూ. 10,669 కోట్లు ఖర్చు చేసినట్లు పవన్ వివరించారు. ఇందులో వేతనాలకే రూ. 6,190 కోట్లు కేటాయించామని, మిగిలిన నిధులతో 'పల్లె పండుగ'లో భాగంగా 21,564 గోకులాలు, 13,500 పశువుల తాగునీటి తొట్టెలు, ఎస్సీ, ఎస్టీ కాలనీలలో 36 వేల కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం వంటి పనులు చేపట్టామని తెలిపారు. ఈ అభివృద్ధి పనులన్నీ శ్రామికుల శ్రమ వల్లే సాధ్యమయ్యాయని కొనియాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని తమ ప్రభుత్వానికి ఉపాధి శ్రామికుల సంక్షేమమే ప్రధాన లక్ష్యమని, పనిచేసే వారికి అండగా నిలుస్తామని పవన్ కల్యాణ్ పునరుద్ఘాటించారు. 
Pawan Kalyan
Andhra Pradesh
Laborers
Workers
Accident Insurance
Welfare Schemes
MGNREGA
State Bank of India
Rural Development
Chandrababu Naidu

More Telugu News