ఇజ్రాయెల్ లో భారీ కార్చిచ్చు.. మంటల్లో నుంచే దూసుకెళ్లిన వాహనాలు.. వీడియో ఇదిగో!
- జెరూసలెం శివార్లలో 3 వేల ఎకరాలు బుగ్గి
- అంతర్జాతీయ సాయం కోరిన ఇజ్రాయెల్ ప్రభుత్వం
- వేలాది మంది నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలింపు
కార్చిచ్చు కారణంగా జెరూసలెం శివార్లలో దాదాపు 3 వేల ఎకరాల మేర కాలి బూడిదైంది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు 160కి పైగా అగ్నిమాపక బృందాలు, విమానాలు, హెలికాప్టర్లు నిరంతరాయంగా శ్రమిస్తున్నాయి. ఇజ్రాయెల్ సైన్యం కూడా సహాయక చర్యల్లో పాల్గొంటోంది. బలమైన గాలుల కారణంగా మంటలను ఆర్పడం కష్టమవుతోందని అధికారులు తెలిపారు. ఇది ఇజ్రాయెల్ చరిత్రలోనే అతిపెద్ద అగ్నిప్రమాదాల్లో ఒకటని పేర్కొన్నారు. కార్చిచ్చు కారణంగా పలు జాతీయ రహదారులను మూసివేశారు.
కార్చిచ్చు తీవ్రత దృష్ట్యా ఇజ్రాయెల్ ప్రభుత్వం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను రద్దు చేసింది. మంటలు జెరూసలేం నగర శివార్లకు కూడా విస్తరించే ప్రమాదం ఉందని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ఇజ్రాయెల్ అంతర్జాతీయ సహాయం కోరింది. ఉక్రెయిన్, స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీ తదితర దేశాలు సహాయక విమానాలను పంపించాయి.