Asaduddin Owaisi: కేంద్ర ప్రభుత్వం ఆలోచనను స్వాగతిస్తున్నాం: అసదుద్దీన్ ఒవైసీ

Owaisi Welcomes Central Governments Caste Census Plan
  • ఎప్పటినుంచో ఉన్న డిమాండ్ అన్న అసదుద్దీన్
  • వెనుకబడిన వర్గాలకు న్యాయమైన వాటా దక్కాలని వ్యాఖ్య
  • కుల గణనకు కాంగ్రెస్ ఎప్పుడూ వ్యతిరేకమేనన్న బండి సంజయ్
  • తెలంగాణ ప్రభుత్వ కుల గణన సర్వే తప్పుల తడక అని విమర్శ
  • కేంద్రం నిర్వహించే కుల గణన శాస్త్రీయంగా ఉంటుందని వ్యాఖ్య
  • జనాభా ప్రకారం రిజర్వేషన్లలో న్యాయం జరుగుతుందని హామీ
కులగణన అంశంపై మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. కుల గణన చేపట్టాలనే కేంద్ర ప్రభుత్వ ఆలోచనను ఆయన స్వాగతించారు. ఇది చాలా కాలంగా ఉన్న డిమాండ్ అని, ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అత్యవసరమని ఆయన అన్నారు. 2021 నుంచి తాను కూడా కుల గణన చేపట్టాలని కోరుతున్నట్లు గుర్తు చేశారు.

స్వతంత్ర భారతదేశంలో ఇలాంటి ప్రయత్నం జరగడం ఇదే మొదటిసారని, కుల గణన అమలులో చొరవ చూపిన ముఖ్యమంత్రులను తాను అభినందిస్తున్నానని తెలిపారు. అయితే, దళిత ముస్లింలకు ఎస్సీ హోదా ఇవ్వడాన్ని, వెనుకబడిన ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని బీజేపీ వ్యతిరేకించిందని ఆరోపించారు. వెనుకబడిన వర్గాలకు విద్య, ఉపాధి అవకాశాల్లో వారి జనాభా ప్రకారం న్యాయమైన వాటా లభించాలని అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ కులగణనకు వ్యతిరేకి: బండి సంజయ్

కాంగ్రెస్ పార్టీ కుల గణనకు సంపూర్ణ వ్యతిరేకి అని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. హైదరాబాద్‌లో బండి సంజయ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ తన పాలనా కాలంలో జనాభా లెక్కల్లో కులాల వారీగా గణన ఎందుకు చేపట్టలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ పార్టీ కుల గణనకు వ్యతిరేకి అనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వే అంతా తప్పుల తడక అని ఆయన విమర్శించారు.

అయితే, ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహించబోయే కుల గణన అత్యంత శాస్త్రీయ పద్ధతిలో జరుగుతుందని పేర్కొన్నారు. ఈ గణన ద్వారా కులాల వారీగా కచ్చితమైన జనాభా లెక్కలు తెలుస్తాయని, తద్వారా జనాభా ఆధారంగా రిజర్వేషన్లలో అందరికీ న్యాయం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టడం మోదీ సర్కార్ ఘనతేనని ఆయన చెప్పారు.
Asaduddin Owaisi
Caste Census
Bundi Sanjay
BJP
Congress
Reservations
Modi Government
SC Status
Telangana
India

More Telugu News