Narendra Modi: అమరావతి పునఃప్రారంభానికి ప్రధాని మోదీ శంకుస్థాపన: ఏపీ సీఎం చంద్రబాబు

PM Modi to Lay Foundation Stone for Amaravatis Revival
  • మే 2న జరిగే ఈ కార్యక్రమానికి అందరూ తరలి రావాలని సీఎం పిలుపు
  • పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేస్తామన్న చంద్రబాబునాయుడు
  • టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు, బూత్‌స్థాయి కార్యకర్తలతో టెలీకాన్ఫరెన్స్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. మే 2వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతిలో పర్యటించి రూ. 49,040 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేయనున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ కార్యక్రమానికి టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు, బూత్‌స్థాయి కార్యకర్తలతో ముఖ్యమంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

రాష్ట్రంలో డీఆర్డీవో, డీపీఐఐటీ, ఎన్‌హెచ్ఏఐ, రైల్వేలకు సంబంధించిన మరో రూ.57,962 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కూడా ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని సీఎం వివరించారు. గత ప్రభుత్వంలో విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని ఇచ్చిన హామీ మేరకు, ప్రజలు కూటమికి అఖండ విజయాన్ని అందించారని గుర్తుచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పది నెలల్లోనే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు.

పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేస్తామని, విశాఖలో టీసీఎస్, వేగంగా నిర్మిస్తున్న భోగాపురం విమానాశ్రయం, శ్రీసిటీలో ఎల్జీ కంపెనీ రూ.5 వేల కోట్ల పెట్టుబడి వంటివి రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతాయని సీఎం పేర్కొన్నారు. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధే ఎన్డీఏ లక్ష్యమని, స్వర్ణాంధ్ర విజన్-2047తో ముందుకు వెళ్తున్నామని తెలిపారు.

గత ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో అమరావతిని నిర్వీర్యం చేసిందని, రైతుల త్యాగాలను వృధా చేసిందని విమర్శించారు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీల సహకారంతో, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, ఇతర రాష్ట్రాల ప్రజలు తమ రాజధానుల గురించి గర్వంగా చెప్పుకున్నట్లే "మా అమరావతి" అని ప్రతి ఆంధ్రుడు గర్వపడేలా రాజధానిని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. రాజధాని నిర్మాణం ద్వారా వచ్చే ఆదాయంతో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడతామన్నారు.

కార్యకర్తలే పార్టీకి మూలస్తంభాలని, వారిని అన్ని విధాలా గుర్తిస్తామని, నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని సీఎం భరోసా ఇచ్చారు. వచ్చే నెలలో అన్నదాత, తల్లికి వందనం పథకాలు ప్రారంభిస్తామని ప్రకటించారు.

సింహాచలం ఘటనపై ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి

సింహాచలంలో ప్రహరీ గోడ కూలి ఏడుగురు భక్తులు మరణించడం అత్యంత బాధాకరమని ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాను సంఘటనా స్థలానికి వెళ్తే భక్తుల దర్శనాలకు అంతరాయం కలుగుతుందని స్థానిక నేతలు సూచించడంతో అమరావతి నుంచే పరిస్థితిని సమీక్షించినట్లు తెలిపారు. మంత్రులు సంఘటనా స్థలానికి వెళ్లి బాధితుల కుటుంబాలను పరామర్శించి, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారని చెప్పారు. తాను ఉదయం నుంచి ఇతర కార్యక్రమాలను రద్దు చేసుకుని ఘటన అనంతర పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించినట్లు ముఖ్యమంత్రి వివరించారు.
Narendra Modi
Amaravati
Andhra Pradesh
Chandrababu Naidu
Foundation Stone
Development Projects
AP Capital
Telugu Desam Party
TDP
National Highway Authority of India

More Telugu News