Visakhapatnam Pakistani Family: విశాఖలో పాకిస్థానీ కుటుంబానికి భారీ ఊరట

Visakhapatnam Pakistani Family Granted Temporary Stay
  • విశాఖలో ఉంటున్న పాకిస్థానీ కుటుంబం
  • అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కుమారుడు
  • మరికొంత కాలం విశాఖలోనే ఉండేందుకు అనుమతి
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో దేశంలో నివసిస్తున్న పాకిస్థానీ పౌరులు భారత్ ను విడిచి వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల గడువు ముగిసిన వేళ, విశాఖపట్నంలోని ఒక పాకిస్థానీ కుటుంబానికి తాత్కాలికంగా ఊరట లభించింది. మానవతా దృక్పథంతో ఆ కుటుంబం మరికొంత కాలం నగరంలోనే ఉండేందుకు అధికారులు అనుమతించారు.

వివరాల్లోకి వెళితే... కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పాకిస్థానీ పౌరులు ఏప్రిల్ 29వ తేదీలోగా దేశం విడిచి వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో విశాఖలో నివసిస్తున్న ఓ కుటుంబం సోమవారం నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీని కలిసి తమ గోడు వెళ్లబోసుకుంది. తమ కుమారుడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడని, నగరంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని వారు సీపీకి వివరించారు.

చికిత్స పూర్తవడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో తమను విశాఖపట్నంలోనే ఉండేందుకు అనుమతించాలని వారు కమిషనర్‌ను అభ్యర్థించారు. తాము దీర్ఘకాలిక వీసా కోసం గతంలోనే దరఖాస్తు చేసుకున్నామని, అయితే అది ఇంకా పెండింగ్‌లోనే ఉందని వారు గుర్తు చేశారు. ఈ కుటుంబంలో భర్త, పెద్ద కుమారుడు పాకిస్థాన్ పౌరసత్వం కలిగి ఉండగా... భార్య, చిన్న కుమారుడు భారత పౌరులుగా ఉండటం గమనార్హం.

కుటుంబం పరిస్థితిని అర్థం చేసుకున్న నగర సీపీ బాగ్చీ వెంటనే స్పందించి, విషయాన్ని ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఏపీ ప్రభుత్వం హైదరాబాద్‌లోని ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (FRRO) అధికారులతో సంప్రదింపులు జరిపింది. ఈ క్రమంలో, వారు విశాఖలో మరికొంత కాలం ఉండేందుకు అధికారులు అనుమతించారు.

ఈ నేపథ్యంలో సీపీ మాట్లాడుతూ... మానవతా కారణాల దృష్ట్యా ఆ కుటుంబం తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు విశాఖపట్నంలోనే ఉండేందుకు అనుమతి లభించిందని తెలిపారు. దీంతో ఆ కుటుంబానికి తాత్కాలికంగా ఊరట లభించినట్లయింది. 
Visakhapatnam Pakistani Family
Pakistani Family in India
Indian Visa
FRRO Hyderabad
Humanitarian Grounds
Visakhapatnam Police Commissioner
Shankhabrata Bagchi
Pakistan Citizen in India
Medical Treatment in Visakhapatnam

More Telugu News