Para Commando: ’హిందువులను రక్షిస్తే తల తీసేస్తాం..‘ అంటూ సైనికుడి ఇంటిముందు బెదిరింపు పోస్టర్

Para Commandos Family Threatened in West Bengal
  • బెంగాల్ జవాన్ గౌరవ్ ముఖర్జీ ఫ్యామిలీకి దుండగుల హెచ్చరిక
  • ప్రస్తుతం కశ్మీర్ లో విధులు నిర్వహిస్తున్న పారా కమాండో గౌరవ్
  • సైనికుడి ఇంటికి 24 గంటల భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు
జమ్మూకశ్మీర్ లో విధులు నిర్వహిస్తున్న పారా కమాండో గౌరవ్ ముఖర్జీకి దుండగుల నుంచి బెదిరింపులు వచ్చాయి. పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లా ధనియాఖలి గ్రామంలో ఉన్న ఆయన ఇంటి బయట బెదిరింపు సందేశాలతో కూడిన పోస్టర్‌ను అతికించారు. శనివారం రాత్రి ఈ పోస్టర్‌ను గుర్తించిన గౌరవ్ కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెంగాలీ భాషలో చేతి రాతతో ఉన్న ఆ పోస్టర్‌లో "గౌరవ్ తల కావాలి," "పాకిస్థాన్ జిందాబాద్" వంటి నినాదాలు ఉన్నాయి. "హిందువులను రక్షిస్తే నీ కుటుంబాన్ని అంతం చేస్తాం. బెంగాల్‌ను బంగ్లాదేశ్‌గా మారుస్తాం" అని బెదిరింపులకు పాల్పడ్డారు.

ఈ ఘటనపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. హుగ్లీ గ్రామీణ పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. గౌరవ్ ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇంటి బయట నిఘా కెమెరాలు అమర్చడంతో పాటు, పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి 24 గంటలు గస్తీ నిర్వహిస్తున్నారు.

గౌరవ్ ఇంటి ముందున్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించిన పోలీసులు.. పోస్టర్ అతికించిన సమయంలో నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు రెండు స్కూటర్లపై అనుమానాస్పదంగా తిరిగినట్లు గుర్తించారు. ప్రాథమికంగా ఇది స్థానిక దుండగుల పనే అయి ఉండవచ్చని అనుమానిస్తున్నామని, అయితే అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. సైనికుడి కుటుంబానికి బెదిరింపులు రావడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Para Commando
Threatening Poster
Gaurav Mukherjee
Hooghly District
West Bengal
Kashmir
Death Threat
Hindu
Bangladesh
Terrorism

More Telugu News