Pawan Kalyan: హామీ నిలబెట్టుకున్నాం: చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన పవన్ కల్యాణ్

Pawan Kalyan Thanks Chandrababu Naidu for Keeping Election Promise
  • చేపల వేట నిషేధ భృతిని రూ. 10 వేల నుంచి రూ. 20 వేలకు పెంచిన కూటమి ప్రభుత్వం
  • శ్రీకాకుళంలో పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
  • హామీ నెరవేర్చడంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హర్షం
ఆంధ్రప్రదేశ్ లోని మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. సముద్రంలో చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు అందించే ఆర్థిక భృతిని రెట్టింపు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం పట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని ఆయన పేర్కొన్నారు.

ఇటీవల శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. గతంలో వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ. 10,000 భృతిగా అందేది. తాజాగా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ మొత్తాన్ని రూ. 20,000కు పెంచినట్లు పవన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల హామీని కార్యరూపం దాల్చేలా చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

"మత్స్యకారులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. వేట నిషేధ భృతిని రెట్టింపు చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నెరవేర్చింది" అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. పెంచిన భృతి మొత్తాన్ని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ పెంపుదల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,29,178 మత్స్యకార కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని, ఇందుకోసం ప్రభుత్వం రూ. 259 కోట్లను కేటాయించిందని వెల్లడించారు.

మత్స్యకారుల వలసలను తగ్గించి, స్థానికంగానే వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పవన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు సుదీర్ఘమైన సముద్ర తీరం ఉందని, ఈ తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం ద్వారా మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని తన ప్రకటనలో స్పష్టం చేశారు.
Pawan Kalyan
Andhra Pradesh
Fishermen
Chandrababu Naidu
Fishing Ban
Financial Assistance
Election Promise
Telugu Desam Party
AP Government
Matsyakarula Bharithi

More Telugu News