Rumsha Rafique: పాక్‌లో పుట్టి ఆ దేశ పౌరసత్వం ఉన్న అమ్మాయి.. 19 ఏళ్లుగా ధర్మవరంలోనే..

Pakistani Girl Living in India for 19 Years Faces Citizenship Issue
  • పహల్గామ్ ఘటన నేపథ్యంలో వెలుగులోకి
  • దేశ విభజన సమయంలో పాకిస్థాన్‌కు వెళ్లిన బళ్లారికి చెందిన మహబూబ్ పీరన్
  • చిన్న కుమార్తెకు ధర్మవరంలోని చెల్లెలి కుమారుడితో వివాహం
  • 1998లో తండ్రిని చూసేందుకు వెళ్లి అక్కడే అమ్మాయికి జన్మనిచ్చిన జీనత్ పీరన్
  • చిన్నారి అక్కడే జన్మించడంతో పాకిస్థాన్ పౌరసత్వం
  • ఆ తర్వాత భారత్ వచ్చినా అదే కొనసాగింపు
పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్‌లోని పాక్ పౌరులను వెనక్కి పంపాలని భారత ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఓ ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్‌లో జన్మించిన ఓ చిన్నారి 19 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరంలో నివసిస్తోంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని బళ్లారికి చెందిన మహబూబ్ పీరన్ దేశ విభజన సమయంలో పాక్ వెళ్లిపోయారు. ఆయనకు అక్కడే ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు జన్మించారు. చిన్న కుమార్తె జీనత్ పీరన్‌ను ధర్మవరంలోని తన చెల్లెలు కుమారుడు రఫిక్ అహ్మద్‌కు ఇచ్చి 1989లో వివాహం జరిపించారు. ఈ జంటకు తొలుత కుమారుడు జన్మించాడు. 1998లో జీనత్ రెండోసారి గర్భం దాల్చింది. అయితే, ఆ సమయంలో పాక్‌లోని తన తండ్రికి ఆరోగ్యం బాగాలేదని సమాచారం రావడంతో చూసేందుకు వెళ్లింది. తిరిగి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో భారత్-పాక్ మధ్య కార్గిల్ యుద్ధం ప్రారంభమైంది. దీంతో ఆమె అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అప్పటికే నిండు చూలాలు కావడంతో అక్కడే ఆమె అమ్మాయి రంశా రఫిక్‌కు జన్మనిచ్చింది. 2005లో జీనత్ తిరిగి ధర్మవరం చేరుకుంది.

రంశా రఫిక్ పాకిస్థాన్‌లో పుట్టడంతో ఆమెకు అక్కడి పౌరసత్వం లభించింది. తర్వాత ధర్మవరం వచ్చి చదువు కొనసాగించినప్పటికీ రంశా భారత పౌరసత్వం కోసం ప్రయత్నించలేదు. ఈ క్రమంలో 2018లో పాక్ పౌరసత్వాన్ని పునరుద్ధరించుకున్నారు. 2028 వరకు పౌరసత్వం మనుగడలో ఉంటుంది. 2023లో భారత పౌరసత్వం కోసం రంశా దరఖాస్తు చేసుకున్నా తిరస్కరణకు గురైంది. ఈ నేపథ్యంలో పాక్ పౌరసత్వం ఉన్న ఆమె భారత్‌లో ఉంటుందా? అధికారులు ఆమెను తిప్పి పంపుతారా? అన్న విషయం చర్చనీయాంశమైంది.
Rumsha Rafique
Pakistan Citizenship
India Citizenship
Dharmvaram
Andhra Pradesh
Kargil War
Pakistan
India
Dual Citizenship
Immigration

More Telugu News