Iran Port Explosion: ఇరాన్ పోర్టులో భారీ పేలుడు: 40కి చేరిన మృతుల సంఖ్య

Death toll from Irans port blast reaches 40 over 1000 wounded
  • ఇరాన్‌లోని హార్మోజ్‌గాన్ ప్రావిన్స్‌ పోర్టులో శనివారం భారీ పేలుడు
  • మృతుల సంఖ్య 40కి చేరినట్లు అధికారిక ప్రకటన
  • వెయ్యి మందికి పైగా గాయాలు, 197 మందికి ఆసుపత్రిలో చికిత్స
ఇరాన్‌లోని దక్షిణ హార్మోజ్‌గాన్ ప్రావిన్స్‌లో గల ఓడరేవులో శనివారం సంభవించిన భారీ పేలుడు పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటనలో మరణించిన వారి సంఖ్య 40కి చేరిందని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఐఆర్ఐబీ వెల్లడించింది. ఈ ఘోర ప్రమాదం నేపథ్యంలో ప్రభుత్వం సోమవారం జాతీయ సంతాప దినంగా ప్రకటించింది.

హార్మోజ్‌గాన్ గవర్నర్ మహమ్మద్ అషౌరీ తజియాని తెలిపిన వివరాల ప్రకారం పేలుడు తదనంతర అగ్నిప్రమాదం కారణంగా వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. వీరిలో 197 మందిని మెరుగైన చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ అధికార ప్రతినిధి ఫాతిమా మొహజెరాని సోషల్ మీడియా ద్వారా సంతాప దినం ప్రకటనను ధృవీకరించారు. 

ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఆదివారం ప్రమాద స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించినట్లు అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఆర్గనైజేషన్ హెడ్ హుస్సేన్ సజెదినియా మాట్లాడుతూ, ఐదు ప్రావిన్స్‌ల నుంచి అగ్నిమాపక బృందాలు మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయని, కొన్ని గంటల్లో మంటలు పూర్తిగా అదుపులోకి వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. పోర్టులోని కొన్ని కంటైనర్లలో తారు వంటి మండే పదార్థాలు, మరికొన్నింటిలో రసాయనాలు ఉన్నాయని ఆయన వివరించారు.

ప్రమాద స్థలంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా, కొన్ని కంటైనర్ల వద్ద మొదట చిన్నగా మంటలు మొదలై, దాదాపు 90 సెకన్ల తర్వాత పెద్ద ఎత్తున పేలుడు సంభవించినట్లు కనిపిస్తోందని గవర్నర్ తజియాని ఆదివారం తెలిపారు. ఈ దుర్ఘటన జరిగినప్పటికీ, పోర్టులోని వార్ఫ్‌ల వద్ద కార్యకలాపాలు, కార్గో హ్యాండ్లింగ్ తిరిగి ప్రారంభమైనట్లు అధికారిక వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ నివేదించింది.
Iran Port Explosion
Hormozgan Province
Mass Casualties
Mohammad Ashouri Tajiyani
Ebrahim Raisi
National Day of Mourning
Iran Disaster
Chemical Fire
Port Explosion Iran
Cargo Handling

More Telugu News