Kirn Mangale: లవ్ మ్యారేజి చేసుకుందని కూతుర్ని కాల్చి చంపిన రిటైర్డ్ ఎస్సై

Retired SI Shoots Daughter Dead for Love Marriage
  • మహారాష్ట్ర జల్గావ్‌ జిల్లాలో దారుణ ఘటన
  • ప్రేమ వివాహం ఇష్టం లేక కూతురిని కాల్చి చంపిన తండ్రి
  • బంధువుల ఇంట్లో హల్దీ వేడుకలో ఈ ఘాతుకం
ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తెను కన్నతండ్రే కిరాతకంగా కాల్చి చంపిన దారుణ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. బంధువుల ఇంట్లో జరుగుతున్న పెళ్లి వేడుకకు భర్తతో కలిసి కుమార్తె హాజరుకాగా, ఈ విషయం తెలుసుకున్న తండ్రి అక్కడికి చేరుకుని విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆమె భర్త గాయపడ్డాడు. జల్గావ్ జిల్లాలో శనివారం రాత్రి ఈ విషాద సంఘటన జరిగింది.

వివరాల్లోకి వెళితే.. జల్గావ్‌కు చెందిన తృప్తి (24), అవినాష్ వాగ్ (28) ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారంతో నిమిత్తం లేకుండా రెండేళ్ల క్రితం వారిద్దరూ వివాహం చేసుకున్నారు. తృప్తి తండ్రి, రిటైర్డ్ సీఆర్పీఎఫ్ ఎస్ఐ అయిన కిరణ్ మాంగ్లేకు ఈ పెళ్లి ఏమాత్రం ఇష్టం లేదు. అప్పటి నుంచి కూతురు, అల్లుడిపై ఆయన కోపంగా ఉన్నాడు.

కాగా, శనివారం రాత్రి చోప్డా పట్టణంలో అవినాష్ సోదరి హల్దీ కార్యక్రమం (పసుపు వేడుక) జరిగింది. ఈ వేడుకకు తృప్తి, అవినాష్ దంపతులు హాజరయ్యారు. ఈ విషయం కిరణ్ మాంగ్లేకు తెలిసింది. దీంతో తీవ్ర ఆగ్రహంతో అక్కడకు చేరుకుని, తన వెంట తెచ్చుకున్న సర్వీస్ రివాల్వర్‌తో కూతురు తృప్తిపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో తృప్తి అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచింది. భార్యను కాపాడేందుకు ప్రయత్నించిన అవినాష్ వాగ్ కూడా కాల్పుల్లో గాయపడ్డాడు.

కళ్ల ముందే జరిగిన ఈ దారుణాన్ని చూసి పెళ్లి వేడుకకు హాజరైన బంధువులు, అతిథులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. కిరణ్ మాంగ్లేను పట్టుకుని తీవ్రంగా కొట్టారు. ఈ దాడిలో కిరణ్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తృప్తి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాల్పుల్లో గాయపడిన అవినాష్‌ను, అతిథుల దాడిలో గాయపడిన కిరణ్ మాంగ్లేను చికిత్స కోసం జల్గావ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 
Kirn Mangale
Trupti
Avinash Wag
Jalgaon
Maharashtra
Love Marriage
Honor Killing
Retired CRPF SI
Murder
India

More Telugu News