Nellore Woman: సైబర్ నేరగాళ్ల వలలో పడి రూ.2.46 కోట్లు పోగొట్టుకున్న నెల్లూరు మహిళ

Nellore Woman Loses 246 Crores in Cyber Crime
  • తక్కువ పెట్టుబడి-అధిక లాభం' ఆశ చూపి నెల్లూరు మహిళకు వల
  • అంతర్రాష్ట్ర ముఠాలోని ఏడుగురు సైబర్ నేరగాళ్ల అరెస్ట్
  • రాజస్థాన్, హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు
  • పోలీసుల అదుపులో నిందితులు, కొనసాగుతున్న విచారణ
తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు' అంటూ ఆశ చూపి, ఓ మహిళ నుంచి ఏకంగా రూ. 2.46 కోట్లు కాజేసిన అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్ల ముఠాను నెల్లూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన ఓ లింక్‌ను నమ్మి మోసపోయిన బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నెల్లూరు ఎస్పీ కృష్ణకాంత్ మీడియా సమావేశంలో వెల్లడించారు.

నెల్లూరు నగరంలోని పొగతోట ప్రాంతానికి చెందిన లలిత అనే మహిళకు తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఆన్‌లైన్ మార్కెటింగ్‌కు సంబంధించిన ఒక లింక్ కనిపించింది. దానిపై క్లిక్ చేయగా, నిషాబసు అనే మహిళ ఆమెను సంప్రదించింది. ఆన్‌లైన్ మార్కెటింగ్‌లో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయని, తాము సూచనలు, సలహాలు అందిస్తామని నమ్మబలికింది. ఇందుకోసం ఓ ప్రత్యేక యాప్‌ను లలిత ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయించింది. ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెడితే లాభాలు రెట్టింపు అవుతాయని ఆశ చూపడంతో, లలిత పలు దఫాలుగా అప్పులు చేసి మరీ డబ్బు జమచేశారు. ఈ ఏడాది జనవరి 23 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ మధ్య కాలంలో మొత్తం రూ. 2,46,30,396 ఆ యాప్ ద్వారా డిపాజిట్ చేశారు.

కొంతకాలం తర్వాత, లలిత ఖాతాలో రూ. 4,02,24,759 జమ అయినట్లు సైబర్ నేరగాళ్లు యాప్‌లో చూపించారు. అయితే, ఆ డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు లలిత ప్రయత్నించగా అది సాధ్యపడలేదు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు, గత నెల (మార్చి) 9వ తేదీన నెల్లూరు చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. సాంకేతిక ఆధారాలను విశ్లేషిస్తూ చెన్నై, హైదరాబాద్, రాజస్థాన్‌లలో విస్తృతంగా గాలించారు. ఈ మోసం వెనుక రాజస్థాన్‌కు చెందిన రామారామ్‌, అతని అనుచరులు గోగారామ్‌, హేమత్‌కుమార్‌, కైలాష్‌, నాగారాంతో పాటు హైదరాబాద్‌కు చెందిన వీరేశ్వరరావు, ఎం. రవి ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు వేగంగా స్పందించి ఈ నెల 25వ తేదీన రాజస్థాన్‌కు చెందిన ఐదుగురు నిందితులను, శనివారం నాడు హైదరాబాద్‌కు చెందిన ఇద్దరిని అరెస్టు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని, వారి నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు విచారణ కొనసాగిస్తున్నట్లు ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. ఈ సైబర్ మోసం అంతర్రాష్ట్ర స్థాయిలో జరగడంతో పోలీసులు కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు
Nellore Woman
Cyber Crime
Online Fraud
Instagram Scam
Investment Scam
2.46 Crores
Cyber Fraud
App Based Fraud
Interstate Cyber Crime
Rajasthan Cyber Criminals

More Telugu News