Pakistan Economy: అప్పు చేస్తే కానీ పూట గడవదు.. యుద్ధానికి సిద్ధమంటూ పాక్ ప్రగల్బాలు

Pakistans Economic Crisis and War Threats Against India
  • తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్
  • 2013లో టీ తాగడం తగ్గించాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేసిన మంత్రి
  • ఐఎంఎఫ్, మిత్రదేశాల రుణాలపై ఆధారపడి నెట్టుకొస్తున్న వైనం
  • ఆర్థిక సంస్కరణల అమలులో సవాళ్లు, మందగించిన వృద్ధి రేటు
  • భారత్‌ తో యుద్ధం పాకిస్థాన్ కు ఆత్మహత్యా సదృశ్యమే
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే.. అప్పులు ఇచ్చి ఆదుకుంటే తప్ప బండి ముందుకు నడవని స్థితి.. అయినా భారత్ తో యుద్ధానికి సిద్ధమంటూ పాకిస్థాన్ ప్రగల్బాలు పలుకుతోంది. ఇటీవల ప్రపంచ బ్యాంకు, మిత్ర దేశాలు ఆదుకోవడంతో పాకిస్థాన్ దివాలా ముప్పును తప్పించుకుంది. ఇప్పటికీ ఆర్థిక పరిస్థితి పెద్దగా మెరుగుపడలేదు. ఈ దుస్థితిలో భారత్‌ తో పరిమిత స్థాయిలో యుద్ధం చేసినా కూడా పాకిస్థాన్ కు పెను విపత్తుగా పరిణమిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.

2023 వేసవిలో దివాలా అంచుకు..
గత కొన్నేళ్లుగా పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర గడ్డు కాలాన్ని ఎదుర్కొంది. కరోనా మహమ్మారి తర్వాత పాక్ పరిస్థితి దిగజారింది. పాలనా వైఫల్యాలు, సైనిక జోక్యం, సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే విధానాలు ఆ దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీశాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టుతో రాజకీయ అనిశ్చితి, బలూచిస్తాన్‌లో తిరుగుబాట్లు దేశాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టాయి. 2023 వేసవి నాటికి దేశం దివాలా తీసే అంచుకు చేరుకుంది. విదేశీ మారక నిల్వలు అత్యంత కనిష్ట స్థాయికి పడిపోవడంతో, టీ తాగడం తగ్గించాలంటూ దేశ ప్రజలకు అప్పటి మంత్రి అహ్సాన్ ఇక్బాల్ విజ్ఞప్తి చేశారు. టీ పొడి దిగుమతి కోసం చేసే విదేశీ మారక నిల్వలు ఖర్చును తగ్గించడానికి ఆయన ఈ విజ్ఞప్తి చేశారు. 

ఆదాయంలో సగం వడ్డీల చెల్లింపులకే.. 
గతేడాది మే నెలలో ద్రవ్యోల్బణం 38.5 శాతానికి చేరగా, వృద్ధి రేటు ప్రతికూలంగా మారింది. వడ్డీ రేట్లు 22 శాతానికి ఎగబాకాయి. విదేశీ మారక నిల్వలు కేవలం 3.7 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఉగ్రవాదానికి నిధులు సమకూరుస్తోందన్న ఆరోపణలతో దాదాపు ఐదేళ్లపాటు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గ్రే లిస్టులో ఉండటం వల్ల అంతర్జాతీయ రుణాలు పొందడం కూడా కష్టతరమైంది. జీడీపీకి, అప్పు నిష్పత్తి 70 శాతానికి చేరడంతో, ప్రభుత్వ ఆదాయంలో 40 నుంచి 50 శాతం వడ్డీల చెల్లింపులకే సరిపోయింది. దివాలా అంచున ఉన్న పాకిస్థాన్ ను అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అందించిన 3 బిలియన్ డాలర్ల స్వల్పకాలిక ఆర్థిక ప్యాకేజీ గట్టెక్కించింది. చిరకాల మిత్రదేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, చైనాలు బిలియన్ల డాలర్ల రుణాలను పునరుద్ధరించడం కొంత ఊరటనిచ్చింది.

నేటికీ బలహీనంగానే ఆర్థిక వ్యవస్థ
ఇటీవల ఐఎంఎఫ్ తో పాకిస్థాన్ స్వల్ప కాలిక రుణం కోసం ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 28 నెలల కాలపరిమితితో పాకిస్థాన్ కు 1.3 బిలియన్ డాలర్లు ఇచ్చేందుకు ఐఎంఎఫ్ సూత్రప్రాయంగా అంగీకరించింది. వాతావరణ మార్పులను తట్టుకునేందుకు ఉద్దేశించిన ఈ రుణ కార్యక్రమానికి బోర్డు ఆమోదం లభించాల్సి ఉంది. ఇది కాకుండా, ప్రస్తుతం కొనసాగుతున్న 7 బిలియన్ డాలర్ల బెయిలౌట్ కార్యక్రమంలో భాగంగా మరో 1 బిలియన్ డాలర్లు విడుదలయ్యే అవకాశం ఉంది. గత 18 నెలల్లో పాకిస్థాన్ స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని పునరుద్ధరించడంలో గణనీయమైన పురోగతి సాధించిందని ఐఎంఎఫ్ పేర్కొంది.

ఫిబ్రవరిలో ఫిచ్ రేటింగ్స్..
ఫిబ్రవరిలో ఫిచ్ రేటింగ్స్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. పాకిస్థాన్ విదేశీ మారక నిల్వలు కొంత మెరుగుపడినప్పటికీ, రాబోయే సంవత్సరంలో విదేశీ నిధుల అవసరాలు గణనీయంగానే ఉంటాయని అంచనా వేసింది. 2025 ఆర్థిక సంవత్సరంలో పాకిస్థాన్ 22 బిలియన్ డాలర్లకు పైగా విదేశీ రుణాలను తిరిగి చెల్లించాల్సి ఉందని తెలిపింది. ఇటీవల ప్రపంచ బ్యాంకు కూడా పాకిస్థాన్ జీడీపీ వృద్ధి అంచనాను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 2.7 శాతానికి తగ్గించింది. కఠినమైన ద్రవ్య, ఆర్థిక విధానాల కారణంగా ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి కొనసాగుతోందని పేర్కొంది.

సంస్కరణలు, సింధు జలాల ఒప్పందం
ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడాలంటే పాకిస్థాన్ అనేక సంస్కరణలను అమలు చేయాల్సి ఉంది. అయితే, పాలకవర్గంలోని రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఈ సంస్కరణల అమలు తరచూ నెమ్మదిస్తోంది. తమ దేశం 7 బిలియన్ డాలర్ల బెయిలౌట్ కార్యక్రమం కింద సంస్కరణల మార్గంలోనే కొనసాగుతుందని ఆర్థిక మంత్రి ముహమ్మద్ ఔరంగజేబ్ ఇటీవల ఐఎంఎఫ్ కు హామీ ఇచ్చారు. మరోవైపు, భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తే, పాకిస్థాన్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది.

భారత్ తో యుద్ధం పాక్ కు ఆత్మహత్యా సదృశమే
ఇటువంటి క్లిష్టమైన ఆర్థిక పరిస్థితుల్లో, పూర్తిగా రుణాలపై ఆధారపడి, ఐఎంఎఫ్ నిర్దేశించిన సంస్కరణలను అమలు చేయడానికి ఇబ్బంది పడుతున్న పాకిస్థాన్, భారత్‌తో సైనిక ఘర్షణకు దిగడం ఆత్మహత్యా సదృశ్యమే అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇమ్రాన్ ఖాన్ పార్టీపై సైనిక అణచివేత, బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలలో తిరుగుబాట్లను అరికట్టడంలో వైఫల్యం కారణంగా తగ్గిన ప్రజాదరణను తిరిగి పొందేందుకు, పాకిస్థాన్ సైనిక నాయకత్వం కశ్మీర్ అంశాన్ని వాడుకోవడానికి ప్రయత్నిస్తోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ, ప్రస్తుత ఆర్థిక దుస్థితిలో యుద్ధానికి దిగడం పాకిస్థాన్ కు ఏమాత్రం శ్రేయస్కరం కాదు.
Pakistan Economy
Pakistan Debt Crisis
IMF Bailout
Pakistan-India Relations
Imran Khan
Pakistan Military
Financial Crisis
World Bank
Economic Sanctions
South Asia

More Telugu News