Pakistan: భారత్ నీళ్లు ఆపేస్తుందా?: సొంత ప్రభుత్వంపై పాకిస్థాన్ నెటిజన్ల వ్యంగ్యాస్త్రాలు

Will India Stop Water Supply to Pakistan Netizens Sarcastic Reactions
  • పహల్గామ్ దాడి తర్వాత భారత్ చర్యలపై పాక్ నేతల వ్యాఖ్యలు
  • ప్రభుత్వంపై సోషల్ మీడియాలో పాక్ నెటిజన్ల వ్యంగ్యాస్త్రాలు
  • నీళ్లు, గ్యాస్, ఆర్థిక దుస్థితిపై సెటైరికల్ మీమ్స్, జోకులు
  • తమ ప్రభుత్వాన్ని, దేశ పరిస్థితులను ఎత్తిచూపుతూ నెటిజన్ల పోస్టులు
  • పాక్ వైమానిక దళంపైనా ట్రోల్స్ వెల్లువ
పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ తీసుకుంటున్న కఠిన చర్యలు, సింధూ జలాల ఒప్పందం అమలు నిలిపివేత వంటి నిర్ణయాల నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం ఎదురుదాడికి దిగుతుంటే, అక్కడి సామాన్య పౌరులు మాత్రం తమ ప్రభుత్వంపైనే సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. దేశంలోని ఆర్థిక దుస్థితి, కనీస వసతుల కొరతను ఎత్తిచూపుతూ తమ అసంతృప్తిని, నిరాశను హాస్యం, మీమ్స్ రూపంలో వెళ్లగక్కుతున్నారు.

జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. దీనికి ప్రతిగా భారత్ సింధూ జలాల ఒప్పందం అమలును నిలిపివేస్తున్నట్లు సూచనప్రాయంగా తెలిపింది. దీనిపై పాక్ రక్షణ మంత్రితో పాటు పలువురు నేతలు తీవ్రంగా స్పందించారు. సింధూ నదిలో ప్రతీ నీటి చుక్కా తమదేనని, నీళ్లు ఆపితే నదుల్లో రక్తం పారుతుందని హెచ్చరించారు.

అయితే, ఈ హెచ్చరికలపై పాక్ నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. "భారత్ నీళ్లు ఆపేస్తుందా? అసలు మాకు నీటి సరఫరానే సరిగా లేదు", "మమ్మల్ని చంపేస్తారా? మా ప్రభుత్వం మమ్మల్ని రోజూ చంపుతూనే ఉందిగా!", "లాహోర్ తీసుకుంటారా? అరగంటలోనే అక్కడ ఏమీ లేదని మీరే తిరిగి ఇచ్చేస్తారు" అంటూ కొందరు తమ ఆవేదనను వ్యంగ్యంగా వెలిబుచ్చారు.

మరో నెటిజన్, ఓ వ్యక్తి స్నానం చేస్తుండగా సబ్బు కళ్లల్లో పడి నీళ్లు ఆగిపోయిన ఫోటోను షేర్ చేస్తూ "భారత్ నీళ్లు వదులు" అని రాసుకొచ్చాడు. పెరుగుతున్న ధరలు, గ్యాస్ కోతలను ఉద్దేశిస్తూ, "యుద్ధం చేయాలనుకుంటే రాత్రి తొమ్మిది లోపే ముగించండి, ఆ తర్వాత గ్యాస్ సరఫరా ఉండదు" అని కొందరు, "మేం పేద దేశంతో పోరాడుతున్నామని వారికి తెలియాలి" అంటూ మరికొందరు వ్యాఖ్యానించారు. కాగితపు అట్టలతో ఫైటర్ జెట్‌లా తయారు చేసిన బైక్‌పై వెళ్తున్న వ్యక్తి ఫోటోను షేర్ చేస్తూ పాక్ వైమానిక దళాన్ని ట్రోల్ చేస్తున్నారు. ఈ మీమ్స్, జోకులు పాకిస్థాన్‌లో నెలకొన్న క్షేత్రస్థాయి పరిస్థితులకు, ప్రజల అసంతృప్తికి అద్దం పడుతున్నాయి.
Pakistan
India-Pakistan Relations
Sindhu Waters Treaty
Pakistan Netizens
Social Media Reactions
Pahalgham Attack
Indo-Pak Tension
Political satire
Memes Pakistan

More Telugu News