Hyderabad Special Branch: పాకిస్థానీల కోసం ఆరా తీస్తున్న హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ అధికారులు

Hyderabad Police Scrutinizes Pakistani Citizens Following Visa Cancellation
  • హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్‌లో 208 మంది పాక్ పౌరుల నమోదు
  • వీరిలో 156 మందికి దీర్ఘకాలిక వీసాలు
  • గడువులోగా దేశం విడిచి వెళ్లాలని పాకిస్థానీలకు ఆదేశాలు
పహల్గామ్ ఉగ్రదాడి ఉదంతం తర్వాత దేశంలో నివసిస్తున్న పాకిస్థానీ పౌరుల వీసాలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. నిర్దేశిత గడువులోగా పాకిస్థానీయులందరూ దేశం విడిచి వెళ్లాలని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో, నగర పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ముఖ్యంగా, హైదరాబాద్ నగర పోలీసు కమిషనరేట్ పరిధిలోని స్పెషల్ బ్రాంచ్‌ లో నమోదైన పాకిస్థానీ పౌరుల వివరాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

సాధారణంగా విదేశీయులు శంషాబాద్‌లోని ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌ (ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ)లో నమోదు చేసుకోవాల్సి ఉండగా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ జాతీయులు మాత్రం నగర పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని పాతబస్తీ పురానీ హవేలీలో ఉన్న ప్రత్యేక విభాగంలో రిజిస్టర్ చేసుకోవాలి. ఈ విభాగం వద్ద లభించిన సమాచారం ప్రకారం, ప్రస్తుతం నగరంలో మొత్తం 208 మంది పాకిస్థానీ పౌరులు అధికారికంగా నమోదై ఉన్నారు. వీరిలో 156 మంది లాంగ్ టర్మ్ వీసా (ఎల్‌టీవీ) కలిగినవారే. సాధారణంగా ఇక్కడి వారిని వివాహం చేసుకున్న వారికి, వారి రక్త సంబంధీకులకు ఈ రకం వీసాలను జారీ చేస్తారు. మరో 13 మంది స్వల్పకాలిక (షార్ట్‌ టర్మ్‌) వీసాలు కలిగి ఉండగా, మిగిలిన వారు వైద్య చికిత్సల నిమిత్తం మెడికల్ వీసాలపై నగరంలో ఉంటున్నారని అధికారులు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో, ఈ 208 మంది ప్రస్తుత నివాసాలు, ఇతర వివరాలను ఎస్‌బీ అధికారులు మరోసారి ధ్రువీకరించుకుంటున్నారు. ఇప్పటికే పాక్ రాయబార కార్యాలయం నుంచి వీరికి తక్షణం భారత్ విడిచి వెళ్లాల్సిందిగా సమాచారం అందినట్లు తెలిసింది. కేంద్రం విధించిన గడువు ముగిశాక, ఎంతమంది దేశం విడిచి వెళ్లారనే వివరాలను ఇమ్మిగ్రేషన్ విభాగం నుంచి పోలీసులు సేకరిస్తారు. గడువు తర్వాత కూడా ఎవరైనా ఇక్కడే ఉండిపోయినట్లు తేలితే, వారిని గుర్తించి బలవంతంగా తిప్పి పంపే ఏర్పాట్లు చేస్తామని ఓ ఉన్నతాధికారి వివరించారు. నగరంలో ఉన్న పాకిస్థానీల్లో ప్రస్తుతం సార్క్‌ వీసా కలిగిన వారు ఎవరూ లేరని కూడా స్పష్టమైంది. 
Hyderabad Special Branch
Pakistani citizens
Visa cancellation
India
Pakistan
Hyderabad Police
Immigration
Foreigners Regional Registration Office (FRRO)
Long-term visa
Short-term visa

More Telugu News