Pahalgham Attack: కశ్మీర్‌కు బుకింగ్స్ క్యాన్సిల్ చేసుకుంటున్న పర్యాటకులు

Pahalgham Attack Kashmir Tourism Suffers Setback as Bookings Cancelled
  • ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇప్పుడిప్పుడే పుంజుకుంటోన్న కశ్మీర్ పర్యాటక రంగం
  • జూన్ వరకు 90 శాతం బుకింగ్స్ కాగా దాడి తర్వాత 80 శాతం రద్దైనట్లు ఒక టూర్ ఆపరేటర్ వెల్లడి
  • అమర్‌నాథ్ యాత్ర నాటికి పరిస్థితులు మెరుగుపడవచ్చని ఆశాభావం
జమ్ముకాశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడి ప్రభావం కశ్మీర్ పర్యాటక రంగంపై పడుతోంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న కశ్మీర్ పర్యాటక రంగాన్ని ఇది తీవ్రంగా దెబ్బతీసింది. ఈ దాడి పర్యాటకులలో భయాందోళనలను రేకెత్తించడంతో పాటు, దేశవ్యాప్తంగా ప్రతికూల సంకేతాలను పంపింది. దాడి జరిగిన వెంటనే పర్యాటకులు తమ ప్రయాణాలను రద్దు చేసుకోవడం ప్రారంభించారు.

"మాకు జూన్ వరకు 90 శాతం బుకింగ్‌లు ఖరారయ్యాయి. కానీ దాడి తర్వాత దాదాపు 80 శాతం బుకింగ్‌లు రద్దయ్యాయి" అని శ్రీనగర్‌కు చెందిన ఒక టూర్ ఆపరేటర్ ఇష్ఫాక్ అహ్మద్ ఆవేదన వ్యక్తం చేశారు. బుకింగ్‌ల రద్దు కంటే, ఈ దాడి పర్యాటక రంగంపై చూపే దీర్ఘకాలిక ప్రభావం పైనే ఎక్కువ ఆందోళన నెలకొందని ఆయన అన్నారు.

దాడి తర్వాత, కశ్మీర్‌కు వచ్చిన పర్యాటకులు తమ భద్రత గురించి తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బెంగళూరు నుంచి వచ్చిన 40 మంది పర్యాటకుల బృందంలో ఆరుగురు భయంతో తమ ప్రయాణాన్ని అర్ధాంతరంగా ముగించుకుని వెనుదిరిగారు.

ఏళ్ల తరబడి శ్రమించి పర్యాటకులను కశ్మీర్ సందర్శనకు ఒప్పించామని, కానీ ఈ దాడి తర్వాత ఆ ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయని ఒక క్యాబ్ ఆపరేటర్ శివమ్ వాపోయారు. తమ వ్యాపారం కోలుకోవడానికి దశాబ్దం పట్టవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.

గత ఐదేళ్లుగా ప్రశాంతంగా ఉన్న పరిస్థితుల తర్వాత జరిగిన ఈ దాడితో పర్యాటక రంగం భారీ నష్టాన్ని చవిచూస్తుందని ప్రముఖ హోటల్ యజమాని ముస్తాక్ ఛాయా తెలిపారు. అయితే, ప్రభుత్వం పరిస్థితిని సమర్థవంతంగా నియంత్రిస్తే జూన్‌లో అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమయ్యే నాటికి పరిస్థితి మెరుగుపడవచ్చని కొందరు టూర్ ఆపరేటర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Pahalgham Attack
Kashmir Tourism
Terrorist Attack
Travel Bookings Cancelled
Ishfaq Ahmad
Shivam
Mustaq Chaya
Article 370
Amarnath Yatra
Kashmir Safety Concerns

More Telugu News