Virat Kohli: ఉగ్రదాడిపై విరాట్ కోహ్లీ స్పందన.. వైరల్ అవుతున్న పోస్ట్

  Virat Kohlis Reaction to Pahalgam Terrorist Attack Goes Viral
  • పహల్గామ్ ఉగ్రదాడిలో 28 మంది మృతి
  • పాకిస్థాన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భారత పౌరులు
  • దుండగులకు శిక్ష పడాలన్న విరాట్ కోహ్లీ
జమ్మూకశ్మీర్‌లోని ప్రఖ్యాత పర్యాటక కేంద్రం పహల్గామ్‌లో అత్యంత దారుణమైన ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఇక్కడి సుందరమైన భైసారన్ వ్యాలీలో విహరిస్తున్న హిందూ పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ భయానక ఘటనలో 26 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఇటీవలి కాలంలో జరిగిన అత్యంత తీవ్రమైన ఉగ్రవాద దాడుల్లో ఇది ఒకటిగా నిలిచింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని, ఆగ్రహాన్ని నింపింది.

ఈ దారుణ ఉగ్రదాడిపై భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్రంగా స్పందించారు. ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. "పహల్గామ్‌లో అమాయక ప్రజలపై జరిగిన దారుణ దాడి నన్ను తీవ్రంగా కలచివేసింది. బాధితుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు శాంతి, బలం చేకూరాలని, ఈ క్రూరమైన చర్యకు పాల్పడిన వారికి శిక్ష పడి న్యాయం జరగాలని ప్రార్థిస్తున్నాను" అని కోహ్లీ పేర్కొన్నారు. కోహ్లీ పోస్ట్ చేసిన కొద్దిసేపటికే అది వైరల్ అయింది. లక్షలాది మంది అభిమానులు, నెటిజన్లు స్పందించారు.

కశ్మీర్‌లో ఇటీవల రికార్డు స్థాయిలో పర్యాటకుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, శాంతిభద్రతలకు విఘాతం కలిగించి, ప్రాంతాన్ని అస్థిరపరిచే వ్యూహంలో భాగంగానే ఈ దాడి జరిగి ఉండవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేవలం నియంత్రణ రేఖ వెంబడి కాకుండా, జమ్మూ ప్రాంతంలోని లోతట్టు ప్రదేశాల్లో కూడా ఉగ్ర కార్యకలాపాలను తీవ్రతరం చేసే ప్రయత్నంలో ఇది భాగం కావచ్చని వారు అనుమానిస్తున్నారు. అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా శాంతి విద్రోహ శక్తులు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నాయని వారు విశ్లేషిస్తున్నారు.
Virat Kohli
Pulwama Terrorist Attack
Kashmir Terrorism
India Terrorism
Viral Post
Kohli Instagram Post
Terrorism in Pahalgam
Pahalgam Attack
Jammu and Kashmir Tourism

More Telugu News