Melinda Gates: బిల్ గేట్స్ అతడితో స్నేహం చేయడం వల్లే మా కాపురం విచ్ఛిన్నమైంది: మెలిండా గేట్స్

Melinda Gates Memoir Reveals Bill Gates Friendship with Jeffrey Epstein as Reason for Divorce
  • జెఫ్రీ ఎప్ స్టీన్ గురించి తన ఆత్మకథలో ప్రస్తావించిన మెలిండా గేట్స్
  • ది నెక్ట్స్ డే పేరుతో మెలిండా గేట్స్ ఆత్మకథ
  • బిల్ గేట్స్... ఎప్ స్టీన్ తో అనేక పర్యాయాలు సమావేశమయ్యారని వెల్లడి
  • ఎప్ స్టీన్ దుర్మార్గానికి నిలువెత్తు ప్రతిరూపం అని తీవ్ర వ్యాఖ్యలు
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తో తన వైవాహిక బంధం ముగిసిపోవడానికి, వివాదాస్పద ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్ స్టీన్ తో ఆయనకున్న స్నేహమే ప్రధాన కారణమని మెలిండా గేట్స్ సంచలన విషయాలు వెల్లడించారు. 'ది నెక్స్ట్ డే' పేరుతో తాను రాసిన తాజా ఆత్మకథలో ఈ వివరాలను ఆమె స్పష్టంగా పొందుపరిచారు. బిల్ గేట్స్ వ్యవహార శైలి తమ వివాహ బంధాన్ని తీవ్రంగా దెబ్బతీసిందని ఆమె పేర్కొన్నారు.

2019 అక్టోబర్ లో బిల్ గేట్స్ ప్రవర్తనపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతూ, న్యూయార్క్ టైమ్స్ (NYT) పత్రికలో ఒక కథనం ప్రచురితమైందని మెలిండా తన పుస్తకంలో గుర్తుచేసుకున్నారు. లైంగిక నేరాల ఆరోపణలు ఎదుర్కొంటూ జెఫ్రీ ఎప్ స్టీన్ 2019లో జైలులో ఆత్మహత్య చేసుకున్నారు. అతడితో బిల్ గేట్స్ పలుమార్లు సమావేశమయ్యారని, కొన్నిసార్లు గంటల తరబడి చర్చలు జరిపారని న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది. ఈ కథనం వెలుగులోకి వచ్చిన తర్వాతే తమ వివాహ బంధంలోని సమస్యల తీవ్రత తనకు పూర్తిగా అర్థమైందని, రాత్రుళ్లు పీడకలలు కూడా వచ్చాయని మెలిండా తెలిపారు.

"ఆ కథనం మా వివాహ బంధానికి మాత్రమే కాదు, నా విలువలకు కూడా బిల్ ద్రోహం చేశారని సూచించేలా తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది" అని మెలిండా తన పుస్తకంలో రాసినట్లు 'పేజ్ సిక్స్' మీడియా సంస్థ వెల్లడించింది. గతంలో 2022లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కూడా, ఎప్ స్టీన్ తో బిల్ గేట్స్ సమావేశాలు జరపడం తనకు ఏమాత్రం ఇష్టం లేదని, ఈ విషయాన్ని తాను ఆయనకు స్పష్టం చేశానని మెలిండా తెలిపారు. 

తాను ఎప్ స్టీన్ ను కేవలం ఒక్కసారే కలిశానని, అదీ ఆ వ్యక్తి ఎవరో చూడాలన్న ఉద్దేశంతోనే వెళ్లానని, కానీ కలిసిన మరుక్షణమే పశ్చాత్తాపపడ్డానని ఆమె పేర్కొన్నారు. "అతను అసహ్యకరమైనవాడు. దుర్మార్గానికి నిలువెత్తు రూపం. అతని వల్ల బాధితులైన మహిళల గురించి తలుచుకుంటే నా గుండె తరుక్కుపోతుంది" అని మిలిందా ఆ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు, జెఫ్రీ ఎప్ స్టీన్ తో పరిచయం తన 'పెద్ద తప్పిదం' అని బిల్ గేట్స్ గతంలోనే అంగీకరించారు. ఈ ఏడాది ఆరంభంలో వాల్ స్ట్రీట్ జర్నల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, "గతాన్ని తలుచుకుంటే, అతనితో సమయం గడపడం నా మూర్ఖత్వం. నేను చాలా తెలివితక్కువగా ప్రవర్తించాను. ప్రపంచ ఆరోగ్య రంగంలో సేవా కార్యక్రమాలకు అతని పరిచయం ఉపయోగపడుతుందని భావించాను. కానీ అలా జరగలేదు. అది కేవలం ఒక పెద్ద తప్పు" అని బిల్ గేట్స్ ఒప్పుకున్నారు. 

2011లో ఎప్ స్టీన్ ను తొలిసారి కలిసిన తర్వాత, అతని జీవనశైలి విభిన్నంగా, ఆసక్తికరంగా ఉందని, కానీ అది తనకు సరిపడదని తన సహోద్యోగులకు బిల్ గేట్స్ ఈ-మెయిల్ చేసినట్లు కూడా గతంలో వార్తలు వచ్చాయి.


Melinda Gates
Bill Gates
Jeffrey Epstein
Divorce
Marriage
Microsoft
The Next Day
Billionaire
Philanthropist
Relationship

More Telugu News