Pawan Kalyan: ఇదే అసలు సిసలైన మన భారతీయ ఆత్మ: పవన్ కల్యాణ్

Pawan Kalyan Praises UNESCO Recognition of Bhagavad Gita and Natyasastram
  • భగవద్గీత, భరతముని నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు
  • స్వాగతించిన పవన్ కల్యాణ్ 
  • భారతదేశం సనాతన ధర్మానికి ప్రతీక అని వెల్లడి
  • మన ప్రాచీన విజ్ఞాన సంపదకు ఎవరి ధృవీకరణ అవసరం లేదని వివరణ
భారతదేశపు అమూల్యమైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వానికి అంతర్జాతీయ స్థాయిలో లభిస్తున్న గౌరవం పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ప్రశంసలు తెలిపారు. యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్‌లో భగవద్గీత, భరతముని నాట్యశాస్త్రాని చోటు దక్కడాన్ని ఆయన స్వాగతించారు. ఈ సందర్భంగా భారతదేశ సంస్కృతి గొప్పదనాన్ని, సనాతన ధర్మం ప్రాముఖ్యతను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.

భారతదేశం సనాతన ధర్మానికి ప్రతీక అని, దేశ సంస్కృతే దాని అసలు సిసలు ఆత్మ వంటిదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. శ్రీమద్ భగవద్గీతలోని శ్రీకృష్ణుని బోధనల నుంచి భరతముని నాట్యశాస్త్రం వరకు మన నాగరికత ప్రపంచానికి మార్గనిర్దేశం చేసిందని ఆయన గుర్తుచేశారు. ఈ ప్రాచీన విజ్ఞాన సంపదకు ఎవరి ధ్రువీకరణ అవసరం లేనప్పటికీ, యునెస్కో వంటి అంతర్జాతీయ సంస్థల గుర్తింపు మన సమిష్టి విశ్వాసాన్ని, నమ్మకాలను మరింత బలోపేతం చేయడానికి దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టి, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నిబద్ధత వల్లే భారత ఆధ్యాత్మిక, సాంస్కృతిక సారాంశానికి ప్రపంచ వేదికపై తగిన గౌరవం లభిస్తోందని పవన్ కళ్యాణ్ కొనియాడారు. వారి నాయకత్వంలో భారతదేశపు గొప్పతనం అంతర్జాతీయంగా గుర్తింపు పొందుతోందని ఆయన తెలిపారు.

భారతీయ కీర్తి ప్రతిష్టలను, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షిస్తూ, భావి తరాలకు అందించేందుకు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
Pawan Kalyan
Indian Culture
UNESCO
Bhagavad Gita
Bharatanatyam
Sanatana Dharma
Indian Heritage
Narendra Modi
Gajendra Singh Shekhawat
Cultural Preservation

More Telugu News