Revanth Reddy: టోక్యో మెట్రోను సందర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Telangana CM Revanth Reddy Visits Tokyo Metro During Japan Trip
  • తొమ్మిది లైన్ల మెట్రోను పరిశీలించిన రేవంత్ రెడ్డి
  • సోనీ సంస్థ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన రేవంత్ రెడ్డి
  • హైదరాబాద్‌లో పెట్టుబడుల అవకాశాలపై వివరించిన ముఖ్యమంత్రి
జపాన్ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టోక్యో మెట్రోను సందర్శించారు. టోక్యో మెట్రోను తొమ్మిది లైన్లతో అత్యాధునికంగా నిర్మించారు. దాని కార్యాచరణ, సాంకేతిక వినియోగాన్ని తెలంగాణ బృందం పరిశీలించింది. ప్రయాణికులకు అందిస్తున్న అత్యంత సౌకర్యవంతమైన సేవలను పరిశీలించింది.

సోనీ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనీ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. సోనీ కంపెనీ యానిమేషన్ అనుబంధ సంస్థ క్రంచైరోల్ బృందాన్ని కలిసి చర్చలు జరిపారు. హైదరాబాదులో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి వివరించారు. యానిమేషన్, వీఎఫ్ఎక్స్, గేమింగ్ రంగాల్లో అనుకూలతలను వివరించారు.

ఆ తర్వాత జపాన్ కంపెనీ మారుబెనీ ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రితో భేటీ అయింది. ఫ్యూచర్ సిటీపై చర్చించారు. ఇందులో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు మారుబెనీ సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు అధికారులు సంతకాలు చేశారు. ఫ్యూచర్ సిటీలో అభివృద్ధి చేసే మొదటి ప్రాజెక్టు ఇదేనని, ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 30 వేల ఉద్యోగాలు వస్తాయని రేవంత్ రెడ్డి అన్నారు.

జపాన్ ఇంటర్నేషనల్ కోపరేషన్ ఏజెన్సీ (జైకా) ప్రతినిధులతోనూ సమావేశమైన ముఖ్యమంత్రి, తెలంగాణలో అభివృద్ధి పనులకు నిధుల సమీకరణపై చర్చించారు. మెట్రో రైలు రెండో దశ, మూసీ పునరుజ్జీవనానికి ఆర్థిక సాయం కోరారు. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ అభివృద్ధికి కూడా ఆర్థిక సాయం కోరారు.
 
Revanth Reddy
Telangana CM
Japan Visit
Tokyo Metro
Sony Corporation
Marubeni Corporation
JICA
Future City
Hyderabad Investments
Animation Industry

More Telugu News