AB Venkateswara Rao: రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు... ప్రకటించిన మాజీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌

Former Intelligence Chief AB Venkateswara Rao Joins Politics
  • రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన ఏబీవీ
  • కోనసీమ జిల్లా ఠాణేలంకలో కోడికత్తి శ్రీను కుటుంబానికి పరామర్శ
  • వైఎస్ జగన్ అక్రమాలు, అన్యాయాలను బయటపెడతానని ప్రకటన
  • జగన్ పాలన బాధితులకు అండగా నిలుస్తానని, న్యాయ పోరాటం చేస్తానని హామీ
  • తనకు జగన్‌తో వ్యక్తిగత కక్షలు లేవని, సమాజ శ్రేయస్సే ముఖ్యమని వెల్లడి
రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మెరుగైన సమాజం కోసం పాటుపడాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని, పదవులపై ఎలాంటి ఆశ లేదని స్పష్టం చేశారు. అయితే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను, అన్యాయాలను మాత్రం కచ్చితంగా ప్రజల ముందు ఉంచుతానని ఆయన పేర్కొన్నారు.

కోనసీమ జిల్లా, ముమ్మిడివరం మండలం ఠాణేలంక గ్రామంలో 'కోడికత్తి' దాడి ఘటనలో నిందితుడైన శ్రీను కుటుంబాన్ని ఏబీ వెంకటేశ్వరరావు ఇవాళ పరామర్శించారు. అనంతరం మీడియాతో, ఆ తర్వాత అమలాపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తన రాజకీయ ప్రవేశం గురించి వివరాలు వెల్లడించారు. తాను ఉద్యోగ విరమణ చేసినప్పుడే కాళ్లు, చేతులు సక్రమంగా ఉన్నంతవరకు వరకు సమాజం కోసం పనిచేస్తానని మాట ఇచ్చానని, ఆ మాటకు కట్టుబడే ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్నానని తెలిపారు.

ఈ సందర్భంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏబీ వెంకటేశ్వరరావు తీవ్ర విమర్శలు గుప్పించారు. "జగన్‌తో నాకు వ్యక్తిగత కక్షలు లేవు. ఆయన చేయాల్సింది చేశారు, నేను చేయాల్సిన పోరాటం చేశాను. ఆ వివాదాల అధ్యాయం ముగిసింది. ఇది కొత్త అధ్యాయం" అని చెబుతూనే, జగన్ అక్రమాలను మాత్రం వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. 

"జగన్ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు తెస్తాం. ఆయన అక్రమ ఆర్థిక సామ్రాజ్యం సండూర్ పవర్‌తో మొదలై లక్షల కోట్లకు చేరింది. విదేశాల నుంచి వందల కోట్ల అనుమానాస్పద నగదు ఆ కంపెనీలోకి వచ్చింది. అదంతా ప్రజల డబ్బే. దోచుకున్న సొమ్మును చట్టపరంగా బయటకు కక్కిస్తాం" అని అన్నారు.

కోడికత్తి శ్రీను ఉదంతాన్ని ప్రస్తావిస్తూ, జగన్ ప్రభుత్వ హయాంలో శ్రీను లాంటి బాధితులు వందలు, వేలల్లో ఉన్నారని అన్నారు. "పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ప్రయోగించినట్లు శ్రీనుపై టెర్రరిస్టులపై పెట్టే కేసులు పెట్టారు. ఆరేళ్లపాటు బెయిల్ రాకుండా చేసి జీవితాన్ని అంధకారం చేశారు. జగన్ కోసం బలైన మొదటి వ్యక్తి అతనే. ఇలాంటి బాధితులందరికీ నా వంతు సహాయం చేసి, వారి కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేస్తా" అని వెంకటేశ్వరరావు హామీ ఇచ్చారు. జగన్ బాధితులు ఎవరైనా తనకు సమాచారం అందించవచ్చని, ఇందుకోసం 7816020048 వాట్సాప్ నంబర్‌ను కూడా ఆయన తెలియజేశారు.

జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రానికి అతిపెద్ద ప్రమాదమని, ఆయన పాలనలో రాష్ట్రం కోలుకోలేని విధంగా దెబ్బతిన్నదని విమర్శించారు. "రాజకీయాలంటే సంపాదన అని జగన్ అనుకుంటారు. గత ఐదేళ్లలో ఆయన చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు. విలువైన సమయం వృధా అయింది. ప్రజలను కులాలు, వర్గాలుగా విడదీస్తారు" అని ఏబీవీ ఆరోపించారు. తన రాజకీయ ప్రయాణాన్ని ప్రజలందరూ ఆశీర్వదించాలని ఆయన కోరారు.
AB Venkateswara Rao
Andhra Pradesh Politics
Retired IPS Officer
YS Jagan Mohan Reddy
Indian Politics
Telugu Politics
Kodikatti Srinu
AP Elections
Corruption Allegations

More Telugu News