Nara Lokesh: నేడు ప్రకాశంలో రిలయన్స్ సీబీజీ ప్లాంట్‌కు భూమిపూజ చేయనున్న నారా లోకేశ్

Nara Lokesh to Lay Foundation Stone for Reliance CBG Plant in Prakasam
  • రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.65 వేల కోట్ల పెట్టుబడితో 500 సీబీజీ ప్లాంట్ల ఏర్పాటు
  • ప్రకాశం జిల్లాలో తొలి సీబీజీ ప్లాంట్ కు భూమి పూజ చేయనున్న మంత్రి నారా లోకేశ్
  • సీబీజీ ప్లాంట్ల ఏర్పాటుతో రెండున్నర లక్షల మందికి ఉపాధి అవకాశాలు
రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.65 వేల కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో 500 కంప్రెస్డ్ బయో గ్యాస్ (సీబీజీ) ప్లాంట్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి విజయానంద్ తెలిపారు. ప్రకాశం జిల్లా పీసీ పల్లి మండలం దివాకరపల్లి సమీపంలో తొలి రిలయన్స్ సీబీజీ ప్లాంట్‌కు బుధవారం మంత్రి నారా లోకేశ్ భూమిపూజ నిర్వహించనున్నారని ఆయన చెప్పారు.

బయో ఫ్యూయల్ ఉత్పత్తిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుందన్నారు. రాష్ట్రంలో హరిత ఇంధన ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. రిలయన్స్ సీబీజీ ప్లాంట్ల ఏర్పాటు ద్వారా సుమారు రెండున్నర లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

ఈ ప్లాంట్ల ద్వారా వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించి హరిత, పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. ప్రతి సీబీజీ ప్లాంట్ రోజుకు 22 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంటుందన్నారు. నిరుపయోగంగా ఉన్న దాదాపు 5 లక్షల ఎకరాల భూమిని ఎనర్జీ ప్లాంటేషన్ కోసం వినియోగిస్తామని విజయానంద్ తెలిపారు.

రిలయన్స్ దేశంలో నాలుగు సీబీజీ హబ్‌లను ఏర్పాటు చేయనుండగా, అందులో ఒకటి ప్రకాశం జిల్లాలో ఏర్పాటుకు నిర్ణయించామని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. 2035 నాటికి కర్బన ఉద్గారాలను సున్నా స్థాయికి తీసుకురావడమే లక్ష్యంగా సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధిని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. సీబీజీ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే 110 లక్షల టన్నుల సేంద్రీయ ఎరువు 15 లక్షల ఎకరాల భూములను సారవంతంగా మార్చేందుకు దోహదపడుతుందన్నారు. 
Nara Lokesh
Reliance Industries
CNG Plants
Prakasam District
Andhra Pradesh
Biofuel
Renewable Energy
Green Energy
Agriculture Waste
Employment Opportunities

More Telugu News