US Immigration: అమెరికాలో చదువుతున్న మన విద్యార్థులకు మరో టెన్షన్.. స్వచ్ఛందంగా వెళ్లిపోవాలంటూ ఈమెయిల్స్

Social Media Activity Leading to US Student Visa Cancellations
  • క్యాంపస్ లలో ఆందోళనలు చేసిన విద్యార్థులకు ట్రంప్ సర్కారు వార్నింగ్
  • ఆందోళనలకు సంబంధించిన చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేసిన వారికీ మెయిల్
  • ఆన్ లైన్ లో యాక్టివ్ గా ఉండే విద్యార్థులకు కొత్త ముప్పు
అమెరికాలో చదువుకుంటున్న కొందరు విదేశీ విద్యార్థులకు అక్కడి ఇమిగ్రేషన్ కార్యాలయం నుంచి ఈమెయిల్ అందింది. ‘బ్యూరో ఆఫ్‌ కాన్సులర్‌ అఫైర్స్‌ వీసా’ పేరుతో ఈ ఈమెయిల్స్ వెళ్తున్నాయి. స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లిపోవాలని అధికారులు అందులో హెచ్చరించారు. క్యాంపస్ లలో జరిగే ఆందోళనలలో పాల్గొనడం లేదా ఆ ఆందోళనలకు సంబంధించిన చిత్రాలను తమ సోషల్ మీడియా ఖాతాలలో పంచుకోవడమే వారు చేసిన తప్పిదంగా తెలుస్తోంది. 

ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో అమెరికాలోని భారతీయ విద్యార్థులు, భారతదేశంలోని వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ నిర్ణయం అమెరికాలోని విదేశీ విద్యార్థుల భావ ప్రకటనా స్వేచ్ఛపై పరిమితులు విధిస్తుందంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జాతి వ్యతిరేక ప్రచారానికి పాల్పడుతున్న వారి సోషల్‌ మీడియా ఖాతాలను అమెరికా విదేశాంగశాఖ కొంతకాలంగా పరిశీలిస్తోంది. అనుమానాస్పదమైన చిత్రాలు లేదా వ్యాఖ్యలు ఉన్న ఖాతాలకు వెంటనే ఈమెయిల్ పంపిస్తోంది.

ఈమెయిల్ లో ఏముందంటే..
‘‘ఇమిగ్రేషన్‌ చట్టంలోని సెక్షన్‌ 221(i) ప్రకారం.. మీ వీసా రద్దయింది. స్టూడెంట్‌ ఎక్చ్సేంజ్‌ విజిటర్‌ ప్రోగ్రామ్‌కు బాధ్యత వహించే అధికారులకు సమాచారం వెళ్లింది. మీ వీసా రద్దు గురించి మీ కళాశాల యాజమాన్యానికి వారు తెలియజేస్తారు. ఈ నేపథ్యంలో మీకు మీరుగా అమెరికాను విడిచి వెళ్లిపోండి. స్వదేశానికి వెళ్లేందుకు సీబీపీ హోమ్ యాప్ మీకు ఉపయోగపడుతుంది. వీసా రద్దయినా ఇక్కడే ఉంటే మిమ్మల్ని అరెస్టు చేయాల్సి వస్తుంది. అంతేకాదు, భవిష్యత్తులో మీకు వీసా రాకుండా చర్యలు తీసుకుంటాం’ అని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది.
US Immigration
Student Visa Cancellation
Bureau of Consular Affairs
Social Media Monitoring
Indian Students in US
Campus Protests
Trump Administration
Section 221(i)
Visa Revocation
CPB Home App

More Telugu News