Hyderabad Metro Rail: హైదరాబాద్ మెట్రోకు రోజుకు కోటిన్నర నష్టం.. చార్జీలు పెంపునకు సర్కారు ససేమిరా!

Hyderabad Metro Faces Rs 15 Crore Daily Loss Govt Hesitates on Fare Hike
  • నష్టాల ఊబిలో కూరుకుపోతున్న హైదరాబాద్ మెట్రో
  • ఆశించిన స్థాయిలో పెరగని ప్రయాణికులు
  • చార్జీలు పెంచాలని ప్రతిపాదన
  • రెండో దశ విస్తరణ నేపథ్యంలో చార్జీల పెంపునకు ససేమిరా అంటున్న ప్రభుత్వం
హైదరాబాద్ మెట్రో రైలుకు రోజుకు దాదాపు కోటిన్నర రూపాయల నష్టం వస్తుండటంతో చార్జీలు పెంచాలని ప్రభుత్వం వద్ద ప్రతిపాదించింది. అయితే, నష్టాలు వచ్చినా సరే ప్రయాణికులపై భారం వేయబోమని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసినట్టు తెలిసింది. సంస్థకు రోజుకు కోటిన్నర రూపాయల నష్టం వాటిల్లుతోందని, దీనికితోడు ప్రాజెక్టు నిర్మాణ సమయంలో అంతర్జాతీయ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు వడ్డీలు చెల్లించలేకపోతున్నామని, కాబట్టి చార్జీల పెంపే ఏకైక మార్గమని ఎల్అండ్‌టీ, హైదరాబాద్ మెట్రో రైలు (హెచ్ఎంఆర్) అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చార్జీల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి కోరేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రయాణికులపై అదనపు భారం మోపేందుకు సుముఖంగా లేదు.

ప్రస్తుతం మెట్రోలోని మూడు కారిడార్లలో రోజుకు 5.10 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. కరోనాకు ముందు మెట్రోకు రోజుకు రూ. 80 లక్షలకుపైగా ఆదాయం సమకూరేది. అయితే, కరోనా లాక్‌డౌన్‌తో మెట్రో ఒక్కసారిగా కుదేలైంది. లాక్‌డౌన్ ఎత్తివేత తర్వాత క్రమంగా కోలుకున్నప్పటికీ నష్టాలు మాత్రం సంస్థను వేధిస్తున్నాయి. అంచనా వేసినట్టుగా ప్రయాణికుల సంఖ్య ఆరు లక్షలకు పెరగకపోవడం, నిర్వహణ ఖర్చులు పెరిగిపోతుండటంతో నష్టాలు మూటగట్టుకుంటోంది.

దీనికి తోడు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కారణంగా మెట్రోలో ప్రయాణించే మహిళల సంఖ్య గణనీయంగా తగ్గిందని, ఈ నేపథ్యంలో టికెట్ చార్జీలను పెంచుకునే వెసులుబాటు కల్పిస్తే కొంతలో కొంత నష్టాలను పూడ్చుకుంటామని మెట్రో అధికారులు చెబుతున్నారు. అయితే మెట్రో రెండో దశ నిర్మాణంపై దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చార్జీల పెంపును కేంద్రం వద్ద ప్రస్తావిస్తే అసలు లక్ష్యం దెబ్బతినే అవకాశం ఉందని భావిస్తోంది. కాగా, మెట్రో చార్జీలు ప్రస్తుతం 10 రూపాయలతో ప్రారంభం అవుతుండగా గరిష్ఠంగా రూ. 60 వరకు ఉన్నాయి. ఇప్పుడీ చార్జీలను సవరిస్తే కనీస రూ 20, గరిష్ఠ చార్జీ రూ. 80గా మారే అవకాశం ఉంది.
Hyderabad Metro Rail
Metro Rail Charges Hike
HMR Losses
Telangana Government
L&T Metro Rail Hyderabad
Public Transport
Fare Increase
Hyderabad Metro
Metro Rail Fares
Commuters

More Telugu News