Sunrisers Hyderabad: సన్ రైజర్స్ ఓటమి... పూరన్, మార్ష్ ఆ విధంగా కొడితే ఎవరైనా ఏం చేస్తారు?

Sunrisers Hyderabads Loss Pooran and Marshs Explosive Innings
  • ఐపీఎల్ లో సన్ రైజర్స్ × లక్నో సూపర్ జెయింట్స్
  • 5 వికెట్ల తేడాతో గెలిచి లక్నో జట్టు
  • 191 పరుగుల లక్ష్యాన్ని 16.1 ఓవర్లలోనే ఛేదించిన వైనం
  • రెండో వికెట్ కు 116 పరుగులు జోడించిన పూరన్-మార్ష్
తొలి మ్యాచ్ లో విధ్వంసక బ్యాటింగ్ తో హడలెత్తించి విజయాన్ని అందుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్... రెండో మ్యాచ్ లో నిరాశపరిచింది. నేడు లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో సన్ రైజర్స్ 5 వికెట్ల తేడాతో ఓడింది. హైదరాబాద్ టీమ్ నిర్దేశించిన 191 పరుగుల విజయలక్ష్యాన్ని లక్నో సూపర్ జెయింట్స్ 16.1 ఓవర్లలో 5 వికెట్లకు కొట్టేసింది. 

ఆ జట్టులో నికోలాస్ పూరన్, మిచెల్ మార్ష్ విధ్వంసక ఆటతీరుతో చెలరేగడంతో సన్ రైజర్స్ బౌలర్లు వెలవెలపోయారు. ముఖ్యంగా, పూరన్ ఆకాశమే హద్దుగా విజృంభించాడు. కేవలం 26 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 70 పరుగులు చేశాడు. మరో ఎండ్ లో మిచెల్ మార్ష్ కూడా ధాటిగా ఆడాడు. మార్ష్ 31 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సులతో 52 పరుగులు చేశాడు. 

అయితే, సన్ రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వీరిద్దరినీ వెంటవెంటనే అవుట్ చేసినా, అప్పటికే జరగాల్సిన డ్యామేజి జరిగిపోయింది. పూరన్-మార్ష్ జోడీ రెండో వికెట్ కు ఏకంగా 116 పరుగులు జోడించడంతో సన్ రైజర్స్ మ్యాచ్ పై ఆశలు వదులుకోవాల్సి వచ్చింది. 

లక్నో సారథి రిషబ్ పంత్ (15), ఆయుష్ బదోనీ (5) తక్కువ స్కోర్లకే అవుటైనా... అబ్దుల్ సమద్ (8 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 22 నాటౌట్), డేవిడ్ మిల్లర్ (13 నాటౌట్) మిగతా పని పూర్తి చేశారు. సన్ రైజర్స్ బౌలర్లలో కమిన్స్ 2, మహ్మద్ షమీ 1, ఆడమ్ జంపా 1, హర్షల్ పటేల్ 1 వికెట్ తీశారు. 

అబ్దుల్ సమద్ గత సీజన్లలో సన్ రైజర్స్ తరఫున ఆడిన ఆటగాడే. వేలంలో అతడిని సన్ రైజర్స్ రిలీజ్ చేయడంతో లక్నో సూపర్ జెయింట్స్ కొనుక్కుంది. ఈ మ్యాచ్ లో చివర్లో అతడే మెరుపులు మెరిపించాడు.
Sunrisers Hyderabad
Nicholas Pooran
Mitchell Marsh
Lucknow Super Giants
IPL 2024
cricket match
T20 cricket
Indian Premier League
Sunrisers loss
Pat Cummins

More Telugu News