Ashutosh Sharma: ఐపీఎల్‌లో అసలైన మజా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీ విజయం

Delhi Capitals Win Thriller Against Lucknow Super Giants in IPL
  • నువ్వా-నేనా అన్నట్టుగా సాగిన మ్యాచ్
  • విజయం అంచుల నుంచి ఓటమిలోకి జారుకున్న లక్నో
  • ఢిల్లీకి చిరస్మరణీయ విజయాన్ని అందించిన అశుతోష్, విప్రజ్ నిగమ్
విశాఖపట్నంలో నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) ఒక వికెట్ తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ)పై విజయం సాధించింది. ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచ్‌లు ఏకపక్షంగా సాగగా ఢిల్లీ-లక్నో మ్యాచ్ మాత్రం ఉత్కంఠగా సాగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు ఒకానొక దశలో 161/3తో బలంగా కనిపించింది. బ్యాటర్ల ఊపు చూస్తే భారీ స్కోరు నమోదు కావడం ఖాయమనిపించింది. అయితే, ఢిల్లీ బౌలర్లు విజృంభించి వరుసపెట్టి వికెట్లు తీయడంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్లు కోల్పోయి 209 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్నో బ్యాటర్లలో మిచెల్ మార్ష్ 36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 72 పరుగులు చేయగా, పూరన్ 30 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్లతో 75 పరుగులు చేశాడు. డేవిడ్ మిల్లర్ 27 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్‌ 3 వికెట్లు తీసుకోగా, కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టాడు. 

అనంతరం 210 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ జట్టు మరో మూడు బంతులు మిగిలి ఉండగానే 9 వికెట్లు కోల్పోయి విశాఖలో చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్ సంచలన బ్యాటింగ్‌తో డీసీకి మరపురాని విజయాన్ని అందించగా, ఘన విజయం ఖాయమనుకున్న లక్నో చేజేతులా ఓటమిని కొని తెచ్చుకుంది.

210 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు కోల్పోయింది. 7 పరుగుల వద్ద రెండో ఓవర్‌లో మూడో వికెట్ చేజార్చుకుంది. 50 పరుగులకు 4 వికెట్లు, 113 పరుగులకు 6 వికెట్లు కోల్పోవడంతో లక్నో విజయం నల్లేరు మీద నడకేనని భావించారు. అయితే, అప్పుడే మ్యాజిక్ జరిగింది. అంతగా ఎవరికీ తెలియని అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్ ఇద్దరూ కలిసి జట్టును నిలబెట్టారు. ఓటమి నుంచి జట్టును విజయ తీరాలవైపు నడిపించారు. లక్నో బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారి క్రీజులో పాతుకుపోయారు. వారిద్దరూ క్రీజులో కుదురుకున్నాక ఫోర్లు,  సిక్సర్లతో విరుచుకుపడి విజయాన్ని లక్నో చేతిలో నుంచి లాగేసుకున్నారు. 

ఢిల్లీ జట్టు గెలుపునకు దగ్గరవుతున్న వేళ విప్రజ్ (15 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 పరుగులు) అవుట్ కావడంతో విజయం దోబూచులాడింది. 168 పరుగుల వద్ద విప్రజ్ అవుటైన తర్వాత 171 పరుగుల వద్ద మిచెల్ స్టార్క్, 192 పరుగుల వద్ద కుల్దీప్ యాదవ్ పెవిలియన్ చేరడంతో ఢిల్లీ ఓటమి తప్పదని భావించారు అయితే, అశుతోష్ ఏమాత్రం తొణక్కుండా క్రీజులో నిలబడి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించిపెట్టాడు. 

అశుతోష్ 31 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 66 పరుగులు చేశాడు. లక్నో బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, మణిమరన్ సిద్ధార్థ్, దిగ్వేష్ రాఠీ, రవి బిష్ణోయ్ తలా రెండు వికెట్లు తీసుకున్నారు. అద్భుత బ్యాటింగ్‌తో జట్టుకు విజయాన్ని అందించిన అశుతోష్ శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఐపీఎల్‌లో నేడు గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.
Ashutosh Sharma
Delhi Capitals
Lucknow Super Giants
IPL 2023
Visakhapatnam
Thriller Match
Mitchell Marsh
Krunal Pandya
IPL Match
Cricket

More Telugu News