Justice Y V Verma: జడ్జి నివాసంలో నోట్ల కట్టలు... కీలక నిర్ణయం తీసుకున్న ఢిల్లీ హైకోర్టు

Justice Y V Vermas Residence Cash Bundles Found Delhi High Court Takes Action
  • జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో అగ్నిప్రమాదం
  • నోట్ల కట్టలు బయటపడినట్టు వార్తలు
  • ఆయనను న్యాయపరమైన విధుల నుంచి తప్పించిన ఢిల్లీ హైకోర్టు రిజిస్ట్ర
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ అధికారిక నివాసంలో పెద్ద మొత్తంలో నగదు కట్టలు బయటపడ్డాయన్న వార్తలు తీవ్ర కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో దిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. జస్టిస్ యశ్వంత్ వర్మను న్యాయపరమైన విధుల నుంచి తప్పిస్తూ ఢిల్లీ హైకోర్టు రిజిస్ట్రీ ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది.

పోలీసులు సేకరించిన వీడియో ఆధారంగా...
జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగినప్పుడు పోలీసులు తీసిన వీడియోలో కాలిపోయిన నోట్ల కట్టలు కనిపించాయి. ఈ వీడియోను ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దేవేంద్రకుమార్‌ ఉపాధ్యాయకు సమర్పించారు. ఆయన ఈ విషయాన్ని నివేదిక రూపంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాకు అందజేశారు. సుప్రీంకోర్టు ఈ విషయంపై వెంటనే స్పందించి, నివేదికలోని ఫొటోలు, వీడియోలతో సహా మొత్తం సమాచారాన్ని తన వెబ్‌సైట్‌లో ఉంచింది.

విచారణకు ముగ్గురు న్యాయమూర్తులతో కమిటీ ఏర్పాటు
ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ వీలైనంత త్వరగా విచారణ ప్రారంభించనుంది. అయితే, విచారణకు సంబంధించిన తుది గడువును మాత్రం నిర్ణయించలేదు.

ఆరోపణలను ఖండించిన జస్టిస్‌ యశ్వంత్ వర్మ
జస్టిస్‌ యశ్వంత్ వర్మ ఈ ఆరోపణలను ఖండించారు. తాను లేదా తన కుటుంబ సభ్యులు ఎవరూ గదిలో నగదు కట్టలు ఉంచలేదని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఇచ్చిన వివరణలో స్పష్టం చేశారు. ఇది తన ప్రతిష్ఠను దిగజార్చేందుకు జరిగిన కుట్ర అని ఆయన పేర్కొన్నారు. తమ నగదు లావాదేవీలన్నీ బ్యాంకుల ద్వారానే జరుగుతాయని, తాము యూపీఐ మరియు కార్డులను ఉపయోగిస్తామని తెలిపారు. ఆ గదిని సాధారణంగా ఉపయోగించని ఫర్నిచర్, సీసాలు, పరుపులు, పాత స్పీకర్లు వంటి వస్తువులను భద్రపరచడానికి స్టోర్ రూమ్ లాగా ఉపయోగిస్తామని ఆయన వివరించారు.
Justice Y V Verma
Delhi High Court
Cash Bundles
Judicial Inquiry
Supreme Court of India
Delhi Police
Corruption Allegations
India News
Legal Case

More Telugu News