Janasena Party: ఆ వార్త‌లు కేవ‌లం ఊహాగానాలు.. లేఖ విడుద‌ల చేసిన జ‌న‌సేన

Janasena Denies Attending Tamil Nadus Deelimitation Meeting
  • డీలిమిటేష‌న్ మీటింగ్‌కు జ‌న‌సేన త‌ర‌ఫున ప్ర‌జా ప్ర‌తినిధులు హాజ‌రైన‌ట్లు ప్ర‌చారం 
  • ఈ స‌మావేశంలో జ‌న‌సేన నుంచి ఎవ‌రు హాజ‌రుకాలేద‌ని పార్టీ స్ప‌ష్టీక‌ర‌ణ‌
  • ఈ మేర‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా లేఖ విడుద‌ల
చెన్నైలో త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన‌ డీలిమిటేష‌న్ మీటింగ్‌కు ఏపీ నుంచి జ‌న‌సేన పార్టీ ప్ర‌జా ప్ర‌తినిధులు హాజ‌రైన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. కానీ, ఈ స‌మావేశంలో జ‌న‌సేన త‌ర‌ఫున ఎవ‌రు హాజ‌రుకాలేదు. ఇదే విష‌య‌మై జ‌న‌సేన పార్టీ సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌త్యేకంగా ఒక లేఖ‌ను విడుద‌ల చేసింది. తాము సీఎం స్టాలిన్ నిర్వ‌హించిన‌ డీలిమిటేష‌న్ మీటింగ్‌కు హాజ‌రైన‌ట్లు వ‌స్తున్న వార్త‌లు కేవ‌లం ఊహాగానాలు మాత్ర‌మేన‌ని ఈ లేఖ ద్వారా స్ప‌ష్టం చేసింది. 

ఈ అఖిల‌ప‌క్ష స‌మావేశానికి హాజ‌రు కావాల్సిందిగా ఆహ్వానం అందింద‌ని, కానీ తాము హాజ‌రు కాలేమ‌ని స‌మాచారం అందించిన‌ట్లు పేర్కొంది. వేర్వేరు కూటములుగా ఉన్నందున స‌మావేశంలో పాల్గొన‌డం కూద‌ర‌ద‌ని మ‌ర్యాద‌పూర్వ‌కంగా తెలియ‌జేయాల‌ని త‌మ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ సూచ‌న మేర‌కు వారికి స‌మాచారం ఇచ్చిన‌ట్లు జ‌న‌సేన పేర్కొంది. ఇక డీలిమిటేష‌న్ పై వారికి ఒక అభిప్రాయం ఉన్న‌ట్లే, త‌మ‌కు ఓ విధానం ఉంద‌ని, ఈ విష‌యాన్ని స‌రైన వేదిక‌పై వెల్ల‌డిస్తామ‌ని లేఖ‌లో పేర్కొన‌డం జ‌రిగింది.  

ఇదిలాఉంటే... కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించిన డీలిమిటేష‌న్ ను త‌మిళ‌నాడులోని డీఎంకే ప్ర‌భుత్వం తీవ్రంగా వ్య‌తిరేకిస్తోంది. 2026 జ‌నాభా లెక్క‌ల ప్ర‌కారం నియోజ‌కవ‌ర్గాల పూనర్విభజనను అంగీక‌రించ‌డం లేదు. ఇదే విష‌య‌మై జాతీయ స్థాయిలో ఉద్య‌మించేందుకు స్టాలిన్ సిద్ధ‌మ‌వుతున్నారు. ఇందుకోసం ద‌క్షిణాది రాష్ట్రాల ప్ర‌జా ప్ర‌తినిధుల మ‌ద్ద‌తు కూడ‌గ‌డుతున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు చెన్నైలో అఖిల‌ప‌క్ష స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి హాజ‌రైన విష‌యం తెలిసిందే.    
Janasena Party
Pawan Kalyan
Tamil Nadu
Stalin
Deelimitation Meeting
Chennai
Revanth Reddy
Andhra Pradesh
Political News
India Politics

More Telugu News