హైదరాబాదులో మెక్ డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీసు ..తెలంగాణ సర్కార్‌తో కీలక ఒప్పందం
- సంస్థ ఛైర్మన్ మరియు సీఈఓతో చర్చలు జరిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- హైదరాబాద్‌లో మెక్ డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీసు ఏర్పాటుపై సంతోషం వ్యక్తం చేసిన సీఎం
- మెక్ డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీసుకై పోటీ పడిన పలు రాష్ట్రాలు
ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో బుధవారం సంస్థ ప్రతినిధులు ఒప్పందం చేసుకున్నారు. 2 వేల మంది ఉద్యోగులతో ఈ సంస్థ కార్యాలయం హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో సదరు సంస్థ ఛైర్మన్, సీఈఓ క్రిస్ కెంప్‌జెన్స్కీతో పాటు సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా తమ గ్లోబల్ కార్యాలయ ఏర్పాటుకు సంబంధించి సంస్థ, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో పెట్టుబడుల ఒప్పందం కుదుర్చుకుంది.
హైదరాబాద్‌లో మెక్ డొనాల్డ్స్ గ్లోబల్ కార్యాలయం ఏర్పాటు చేయడానికి ముందుకు రావడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ గ్లోబల్ సెంటర్ తమ రాష్ట్రంలోనే ఏర్పాటు చేయాలని పలు రాష్ట్రాలు పోటీ పడుతున్న తరుణంలో సంస్థ తెలంగాణను తమ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఎంచుకోవడం గర్వంగా ఉందని సీఎం అన్నారు. ప్రభుత్వం తరపున సంస్థకు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి పాల్గొన్నారు.