Pawan Kalyan: చంద్రబాబు, లోకేశ్ లకు కృతజ్ఞతలు తెలిపిన పవన్ కల్యాణ్

Pawan Kalyan Expresses Gratitude to Chandrababu Naidu and Lokesh
  • జనసేన ఆవిర్భావ దినోత్స శుభాకాంక్షలు తెలిపిన వారికి ధన్యవాదాలు తెలిపిన పవన్
  • సభ విజయానికి కృషి చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపిన వైనం
  • పార్టీ బలోపేతానికి కృషి చేయాలని శ్రేణులకు పిలుపు.
పిఠాపురం నియోజకవర్గంలోన చిత్రాడలో మార్చి 14న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరగడం తెలిసిందే. జయకేతనం పేరిట నిర్వహించిన ఈ సభ విజయవంతంగా ముగిసిన సందర్భంగా పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 

ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, ఎన్డీయే పక్షాల నాయకులు, శ్రేయోభిలాషులు, సినీ పరిశ్రమ మిత్రులు తమకు శుభాకాంక్షలు తెలిపారని... ఈ సందర్భంగా వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

జనసేన పార్టీ భవిష్యత్తులో మరింత శక్తిమంతంగా ఎదగడంతో పాటు, సామాన్యుల గొంతుకగా పనిచేస్తూ, రాష్ట్ర ప్రయోజనాలు, జాతీయ సమైక్యత లక్ష్యంగా మరింత బాధ్యతగా వ్యవహరిస్తుందని ఆయన వివరించారు.

'జయకేతనం' బహిరంగ సభ విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రతి ఒక్క జనసేన నాయకుడికి, జన సైనికులకు, వీర మహిళలకు పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. వేదికపై కనిపించకపోయినా ఎంతో మంది కార్యకర్తలు ఈ వేడుక కోసం తెర వెనుక ఎంతో శ్రమించారని, వారి సహకారం వెలకట్టలేనిదని ఆయన అన్నారు.

అంతేకాకుండా, ఈ వేడుకను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించడానికి సహకరించిన పోలీసు శాఖకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్, ఇతర పోలీసు సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లా అధికార యంత్రాంగం, కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సహకారానికి కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

మంత్రి, జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, మంత్రి కందుల దుర్గేశ్, ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, పిఠాపురం ఇంచార్జి మర్రెడ్డి శ్రీనివాస్, ఇతర శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, వివిధ జిల్లాల నాయకులకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించిన ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్ మరియు సభ్యులకు, వైద్య సేవలు అందించిన డాక్టర్ సెల్ బృందానికి, వాలంటీర్లకు, మీడియా సిబ్బందికి, జనసేన శతఘ్ని బృందానికి ఆయన అభినందనలు తెలియజేశారు.

వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన సాంస్కృతిక విభాగం, ఫుడ్ కమిటీ, స్టేజ్ డెకరేషన్ బృందం, పారిశుద్ధ్య సిబ్బందికి పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. సభకు స్థలం ఇచ్చిన దాతలకు, పారిశుద్ధ్య సేవలు అందించిన సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయ సిబ్బందికి, తన వ్యక్తిగత భద్రతా సిబ్బందికి కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. రానున్న రోజుల్లో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.
Pawan Kalyan
Jana Sena Party
Chandrababu Naidu
Lokesh
Party Anniversary
Political News
Andhra Pradesh
Vijayakethanam
Public Meeting
Gratitude

More Telugu News