Kohli Teammate: ఐపీఎల్ మ్యాచ్ లకు అంపైర్ గా అండర్ 19 వరల్డ్ కప్ హీరో

Under19 World Cup Hero to IPL Umpire Tanmay Srivastavas Journey
  • కోహ్లీతో కలిసి అండర్ 19 జట్టులో ఆడిన తన్మయ్ శ్రీవాస్తవ
  • అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టకుండానే ఆటకు వీడ్కోలు
  • 2008 అండర్ 19 వరల్డ్ కప్ లో కీలక ఇన్నింగ్స్ ఆడిన శ్రీవాస్తవ
భారత జట్టులో స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాల సహచరుడు, అండర్-19 జట్టులో వారితో ఆడిన ఓ ప్లేయర్ ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ లకు అంపైర్ గా వ్యవహరించబోతున్నాడు. 2008 లో జరిగిన అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చిన ఆ ఆటగాడి పేరు తన్మయ్ శ్రీవాస్తవ. అండర్-19 జట్టులో కోహ్లీ, జడేజాలతో కలిసి ఆడినా దురదృష్టవశాత్తూ భారత జట్టులోకి తన్మయ్ శ్రీవాస్తవ ఎంట్రీ ఇవ్వలేకపోయాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్ ఆడకుండానే ఐదేళ్ల క్రితం రిటైర్మెంట్ ప్రకటించాడు.

అయితే, క్రికెట్ పైన ఉన్న ఇష్టంతో ప్రస్తుతం అంపైర్ గా అవతారమెత్తాడు. అంతకుముందు క్రికెట్ వ్యాఖ్యతగా కూడా వ్యవహరించాడు. తాజాగా ఐపీఎల్ మ్యాచ్ లకు తన్మయ్ శ్రీవాస్తవను అంపైర్ గా ఎంపిక చేస్తూ అధికారిక ప్రకటన కూడా వెలువడింది. దీనిపై ఉత్తరప్రదేశ్‌ క్రికెట్ అసోసియేషన్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ‘నిజమైన ఆటగాడు ఎప్పుడూ మైదానం వీడాలనుకోడు. ఇక్కడ పాత్ర మాత్రమే మారింది. తన్మయ్ శ్రీవాస్తవకు ఆల్‌ ది బెస్ట్. ఆటపై అభిరుచితో నూతన బాధ్యతలు చేపట్టిన తన్మయ్‌కు శుభాకాంక్షలు’ అని పోస్టు చేసింది.

అండర్-19 వరల్డ్ కప్ లో..
2008లో అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఇండియా, సౌతాఫ్రికాల మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా కేవలం 159 పరుగులకే ఆలౌట్ అయింది. కోహ్లీ 19 పరుగులు మాత్రమే చేయగా.. మూడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన తన్మయ్ శ్రీవాస్తవ 46 పరుగులు చేశాడు. జట్టులో తన్మయ్ దే కీలక ఇన్నింగ్స్ కావడం విశేషం. ఆ తర్వాత భారత బౌలర్లు విజృంభించడంతో సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్ ను కట్టడి చేశారు. సౌతాఫ్రికా స్కోరు 103/8కు చేరిన తర్వాత వర్షం కారణంగా మ్యాచ్ కు అంతరాయం కలిగింది. చివరకు డక్‌వర్త్‌ లూయిస్ పద్ధతి ప్రకారం టీమిండియా 12 పరుగుల తేడాతో గెలిచి వరల్డ్ కప్ ను అందుకుంది.


Kohli Teammate
Tanmay Srivastava
IPL Umpire
Under-19 World Cup
Jadeja
Indian Cricket
Umpiring Career

More Telugu News