Narsimhulu: లంచం కోసం ఎస్సై అరాచకం.. మహిళ మంగళసూత్రం తాకట్టు పెట్టించిన వైనం

Andhra Pradesh Police Officer Faces Suspension After Bribery Scandal
  • 2023లో చిత్తూరు జిల్లాలో ఘటన.. తాజాగా వెలుగులోకి
  • మహిళ నుంచి లక్ష రూపాయలు డిమాండ్ చేసిన ఎస్సై నరసింహులు
  • తన వద్ద లేవని చెప్పడంతో మంగళసూత్రం తాకట్టు పెట్టి ఇవ్వాలన్న ఎస్సై
  • స్వయంగా తాకట్టు వ్యాపారి వద్దకు పంపి కుదువ పెట్టించిన వైనం
  • ఓ యువకుడిపై అక్రమంగా హత్యాయత్నం కేసు
  • అరాచకాలు వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారుల విచారణ
  • ఆరోపణలన్నీ నిజాలేనని తేలడంతో సస్పెన్షన్
లంచం కోసం మహిళ మంగళసూత్రాలు తాకట్టు పెట్టించిన చిత్తూరు జిల్లా ఎస్సైపై ప్రభుత్వం వేటేసింది. అయితే, ఈ ఘటన ఇప్పుడు జరిగింది కాదు, 2023లో గత ప్రభుత్వ హయాంలో జరిగింది. తాజాగా విషయం వెలుగులోకి రావడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. 2023 సెప్టెంబర్‌లో తన భార్య అదృశ్యమైనట్టు ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, ఆ తర్వాతి రోజు పోలీస్ స్టేషన్‌కు వచ్చిన మహిళ తమ మధ్య కుటుంబ పరమైన వివాదాలు ఉన్నాయని, కాబట్టి భర్తకు దూరంగా ఉండాలని అనుకుంటున్నానని ఎస్సై నరసింహులకు చెప్పింది. 

అయితే, అలా ఉండాలనుకుంటే తనకు లక్ష రూపాయలు ఇవ్వాలని ఎస్సై డిమాండ్ చేశాడు. తన వద్ద అంత డబ్బు లేదని చెప్పడంతో మెడలోని మంగళసూత్రం తాకట్టు పెట్టి ఇవ్వాలని కోరాడు. అంతేకాదు, తనకు తెలిసిన తాకట్టు వ్యాపారి వద్దకు పంపి మంగళసూత్రాన్ని కుదువ పెట్టించాడు. అప్పటికప్పుడు ఆమె ఫోన్ పే నుంచి రూ. 60 వేలు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నాడు. అయితే, విషయం బయటపడటంతో ఆ తర్వాత రామన్న అనే కానిస్టేబుల్ ద్వారా వడ్డీ సహా ఆమెకు నగదు తిరిగి ఇచ్చేశాడు.

అలాగే, కమ్మపల్లెలో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేని యువరాజులు నాయుడిని హత్యాయత్నం కేసులో ఇరికించేందుకు ఎస్సై నరసింహులు మరో వర్గం నుంచి రూ. 7 లక్షలు తీసుకున్నాడు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన యువరాజులుపై కేసు నమోదు కావడంతో ఆయన అమెరికా వెళ్లే అవకాశం కోల్పోయాడు. దీంతో అతడు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. విచారణ జరిపి అతడు చెప్పింది నిజమేనని నిర్ధారించారు. 

అలాగే, మరో కేసులో రూ. 3 లక్షల విలువైన వెదురుకర్రలు దొంగిలించారని ఓ మహిళ ఫిర్యాదు చేయగా తప్పుడు కేసుగా పేర్కొంటూ దానిని మూసేశారు. తాజాగా, ఈ విషయాలన్నీ వెలుగులోకి రావడంతో అనంతపురం డీఐజీ షేముషీ బాజ్‌పేయి.. చౌడేపల్లె సీఐతో విచారణ జరిపించారు. ఈ సందర్భంగా ఆయనపై వచ్చిన ఆరోపణలన్నీ వాస్తవాలేనని నిర్ధారణ కావడంతో సస్పెండ్ చేశారు. ఎస్సై నరసింహులు ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు జిల్లా ఆస్పరి పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్నాడు.
Narsimhulu
Chittoor District SI
Bribery
Woman's Mangalsutra
Fake Case
Police Corruption
Andhra Pradesh Police
Suspension
7 Lakhs Bribe
Yuvrajulu Naidu

More Telugu News