Revanth Reddy: అందుకే తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరును తొలగించాం!: రేవంత్ రెడ్డి

Revanth Reddy clarifies why removed Potti Sriramulu name to Telugu University
  • పాలనాపరమైన సమస్యలు ఉత్పన్నం కాకుండా పేరు మార్చినట్లు వెల్లడి
  • తెలంగాణ ఏర్పడిన తర్వాత చాలా యూనివర్సిటీల పేర్లు మార్చుకున్నట్లు వెల్లడి
  • రోశయ్య, ఆర్యవైశ్య సమాజం పట్ల ప్రభుత్వానికి గౌరవం, నమ్మకం ఉందన్న ముఖ్యమంత్రి
తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరును తొలగించి సురవరం ప్రతాప్ రెడ్డి పేరును పెట్టడానికి గల కారణాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో ఒకే పేరుపై విశ్వవిద్యాలయాలు, సంస్థలు ఉంటే పరిపాలనాపరమైన సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని ఆయన అన్నారు. అందుకే మన రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, సంస్థలకు తెలంగాణకు సంబంధించిన పేర్లు పెడుతున్నట్లు చెప్పారు.

శాసనసభలో ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్, తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్పు తదితర బిల్లులు ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా విశ్వవిద్యాలయాలకు పేర్లు మార్చుకున్నామని గుర్తు చేశారు.

పరిపాలనా సౌలభ్యం కోసమే ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ, పీవీ నరసింహారావు, కాళోజీ నారాయణరావు పేర్లు పెట్టుకున్నట్టు తెలిపారు. అలాగే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప్ రెడ్డి పేరును పెడుతున్నట్లు చెప్పారు. సురవరం ప్రతాప్ రెడ్డి తెలంగాణ సమాజానికి ఎంతో సేవ చేశారని కొనియాడారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడారని, గోల్కొండ పత్రికను నడిపారని గుర్తు చేసుకున్నారు.

పొట్టి శ్రీరాములు పేరును మార్చడం ఎవరికీ వ్యతిరేకం కాదని, కేవలం పరిపాలనా సౌలభ్యం కోసమేనని తెలిపారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి రోశయ్య, ఆర్యవైశ్య సమాజం పట్ల ప్రభుత్వానికి అపారమైన గౌరవం, నమ్మకం, విశ్వాసం ఉందని తెలిపారు. కులం, మతం పేరుతో రాజకీయ ప్రయోజనాల కోసం చూడవద్దని కోరారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కి లేఖ రాస్తామన్నారు. దేశం కోసం ఆయన చేసిన త్యాగాలను గుర్తు చేసుకుందామన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి కిషన్ రెడ్డి, బండి సంజయ్ అనుమతులు తీసుకుని రావాలని విజ్ఞప్తి చేశారు.

బల్కంపేటలోని నేచర్ క్యూర్ ఆసుపత్రికి కొణిజేటి రోశయ్య పేరు పెడతామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆయన సుదీర్ఘ అనుభవం గల నేత అన్నారు. గవర్నర్‌గా, ముఖ్యమంత్రిగా, సుదీర్ఘ కాలం ఆర్థికమంత్రిగా సేవలు అందించారని గుర్తు చేశారు. నేచర్ క్యూర్ ఆసుపత్రికి సమీపంలో రోశయ్య విగ్రహాన్ని నెలకొల్పి అధికారికంగా జయంతి, వర్ధంతిలను నిర్వహిస్తామని తెలిపారు.
Revanth Reddy
Potti Sriramulu
Rosaiah
Congress
Telangana

More Telugu News