Holi: మసీదులపై కవర్లు కప్పిన యూపీ అధికారులు.. కారణం ఇదే..!

UP Government To Cover 10 Mosques In Sambhal During Holi Celebrations
  • శుక్రవారం హోలీ సందర్భంగా సంబాల్ లో అధికారుల ముందు జాగ్రత్తలు
  • ఘర్షణలు తలెత్తకుండా చర్యలు చేపట్టిన పోలీసులు
  • మధ్యాహ్నం వరకు హోలీ, ఆ తర్వాత రంజాన్ ప్రార్థనలు 
ఉత్తరప్రదేశ్ లోని సంభాల్ లో మసీదులపై ఉన్నతాధికారులు టార్పాలిన్ షీట్లను కప్పారు. నగరంలోని దాదాపు పది మసీదులకు ఇలా కవర్లతో ముసుగు వేశారు. శుక్రవారం హోలీ పండుగ సందర్భంగా మసీదులపై రంగులు పడకుండా ఈ జాగ్రత్తలు తీసుకున్నారు. ఓవైపు హోలి, మరోవైపు రంజాన్ ఝుమ్మా ప్రార్థనల నేపథ్యంలో శుక్రవారం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుండా చర్యలు తీసుకున్నారు. హోలీ వేడుకల్లో భాగంగా జనం ర్యాలీగా వెళ్లే మార్గాలను గుర్తించి ఆ చుట్టుపక్కల మసీదుల వద్ద బలగాలను మోహరించారు. ఘర్షణలు తలెత్తకుండా ఇరువర్గాలతో ముందస్తుగా చర్చలు జరిపారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు హోలీ జరుపుకునేలా, ఆ తర్వాత శుక్రవారం ప్రార్థనలు జరుపుకునేలా ఇరువర్గాలను ఒప్పించారు. 

గతేడాది సంభాల్ లో కోర్టు ఆదేశాలతో జామా మసీదు సర్వే కోసం వెళ్లిన అధికారులపై దాడి జరిగింది. ఈ సందర్భంగా చెలరేగిన అల్లర్లలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో సంభాల్ లో ఉన్నతాధికారులు భారీగా భద్రతాదళాలను మోహరించారు. ప్రస్తుతం సంభాల్ లో శాంతి నెలకొందని, జనం తమతమ వ్యవహారాల్లో మునిగిపోయారని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే హోలీ పండుగ, రంజాన్ పండుగలు రావడంతో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. మతపరంగా సున్నితమైన ప్రాంతం కావడంతో ఘర్షణలు చెలరేగే అవకాశం ఉందని పోలీసులు ముందు జాగ్రత్తలు చేపట్టారు. పీస్ కమిటీతో చర్చించి హోలీ, శుక్రవారం ప్రార్థనలు సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేశారు.
Holi
Uttar Pradesh
Sambhal
Majid
Covers

More Telugu News