Chandrababu: ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన నంద్యాల జిల్లా ప్రజా ప్రతినిధులు.. కీలక సమస్యలపై వినతి పత్రం అందజేత

Nandyala Dist ministers and MLAs met CM Chandrababu
  • నంద్యాల జిల్లాలో వరి, జొన్న పంటలకు మద్దతు ధర కల్పించాలని వినతి 
  • సీఎంను కలిసిన మంత్రులు ఎన్ ఎండీ ఫరూఖ్, బీసీ జనార్దన్ రెడ్డి
  • జొన్న మద్దతు ధరను రూ.3400కు పెంచి రైతులను ఆదుకోవాలని వినతి 
వరి, జొన్నపంటలకు సరైన గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్న క్రమంలో.. మద్దతు ధర ప్రకటించి అన్నదాతలను ఆదుకోవాలని కోరుతూ నంద్యాల జిల్లా ప్రజా ప్రతినిధులు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వినతి పత్రం సమర్పించారు. 

అసెంబ్లీలో మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబును మంత్రులు ఎన్ ఎండీ ఫరూఖ్, బీసీ జనార్దన్ రెడ్డి, నంద్యాల జిల్లా ఎమ్మెల్యేలు గౌరు చరితా రెడ్డి, బుడ్డా రాజశేఖర్ రెడ్డి, భూమా అఖిల ప్రియ, గిత్త జయసూర్య కలిసి నంద్యాల జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించారు. 

ప్రస్తుతం నంద్యాల జిల్లాలో వరి, జొన్న పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ముఖ్యమంత్రి దృష్టికి నాయకులు తీసుకువచ్చారు. ప్రస్తుతం జిల్లాలో క్వింటా జొన్నలకు రూ.2,400 మాత్రమే గిట్టుబాటు ధర చెల్లిస్తున్నారని, కాబట్టి మద్దతు ధరను రూ.3400 కు పెంచి జొన్న రైతులను ఆదుకోవాలని కోరారు.  

అలాగే ప్రస్తుతం జిల్లాలో క్వింటా వరి పంటకు రూ.1,200 మాత్రమే గిట్టుబాటు ధర చెల్లిస్తున్నారని, దీని మద్దతు ధరను రూ.1800 కు పెంచి, వరి పండించే రైతులను సైతం ఆదుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేశారు. వరి, జొన్న పంటకు మద్దతు ధర పెంపుపై మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. 
Chandrababu
Nandyala dist
Andhra Pradesh

More Telugu News