Krishna River: ఇసుక రవాణా కోసం కృష్ణా నదిలో ఏకంగా రోడ్డు వేసిన మాఫియా

Sand Mafia Built A Rode in Krishna River In Narayanpet District
  • నారాయణపేట జిల్లాలో ఇసుక అక్రమ రవాణా
  • రాత్రిపూట ఇసుక తవ్వి కర్ణాటకకు తరలింపు
  • గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న దందా
తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. రాత్రి పూట ఇసుక తవ్వుతూ దానిని కర్ణాటకకు తరలించేందుకు ఏకంగా రాత్రికిరాత్రే కృష్ణానదిలో ఓ రోడ్డు నిర్మించింది. కోట్లాది రూపాయల ఈ దందా నిరాటంకంగా సాగిపోతోంది. నదిలో ఎనిమిది కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించి మరీ ఇసుకను తరలిస్తున్నా అధికారులు మాత్రం అటువైపు తొంగిచూడడం లేదు.
 
నారాయణపేట జిల్లాలోని కృష్ణా మండలంలో కృష్ణా నది తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. నదికి ఇటువైపు కృష్ణా, వాసునగర్, ముడుమాల్, పస్పుల, అంకెన్‌‌‌‌పల్లి, టైరోడ్‌ ప్రాంతాలు ఉండగా.. అవతలివైపు కర్ణాటక రాష్ట్రానికి చెందిన గంజిపల్లి, దేవసూగూరు, కొర్తికొండ, ఆత్కూరు గ్రామాలు ఉన్నాయి. తెలంగాణలోని టైరోడ్డు సమీపంలో కృష్ణా నదిలో ఇసుక అక్రమంగా తవ్వకాలు జరుగుతున్నాయి. నదిలో నీళ్లు లేకపోవడంతో టైరోడ్డు నుంచి కర్ణాటక వైపు వెళ్లేందుకు అక్రమార్కులు ఏకంగా నదిలోనే మట్టిరోడ్డు నిర్మించారు. అక్కడక్కడా స్వల్పంగా నీటి ప్రవాహం ఉండడంతో చిన్న చిన్న తూములు ఏర్పాటు చేసి మరీ రోడ్డేశారు.

సుమారు 8 కిలోమీటర్ల మేర రోడ్డు వేసి రాత్రిపూట టిప్పర్లతో యథేచ్చగా ఇసుకను తరలిస్తున్నారు. ఇసుక తవ్వకాల కారణంగా నదిలో ఎక్కడ చూసినా గోతులే కనిపిస్తున్నాయి. నది ఒడ్డున పెద్ద సంఖ్యలో ఇసుక డంపులు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. నదిలో రోడ్డు నిర్మించి మరీ ఇసుక తరలిస్తున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఈ వ్యవహారంలో ఓ రాజకీయ నాయకుడి ప్రమేయం ఉందని, అందువల్లే అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Krishna River
Sand Mafia
Road
Karnataka
Telangana

More Telugu News