Nara Lokesh: ఏపీలో 125 కొత్త స్పెషల్ నీడ్స్ పాఠశాలలకు ప్రతిపాదనలు: మంత్రి నారా లోకేశ్

Nara Lokesh answers the question about Children With Special Needs
  • కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు
  • ప్రత్యేక అవసరాలున్న పిల్లల గురించి ప్రశ్నించిన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్
  • సమాధానమిచ్చిన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ 
వివిధ రకాల రుగ్మతలకు గురై ప్రత్యేక ఏర్పాట్లు (స్పెషల్ నీడ్స్) అవసరమైన పిల్లలు ఇంట్లో ఉన్నపుడు తల్లిదండ్రులు అనేక సమస్యలు ఎదుర్కొంటుంటారు, వారి అవసరాలను ఆసరాగా తీసుకొని ప్రైవేటు సంస్థలు కొన్ని రూ.50 వేలు కూడా వసూలు చేస్తున్నాయని ఏపీ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. 

శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ మాట్లాడుతూ... స్పెషల్ నీడ్స్ పిల్లలకు టీచర్ అండ్ స్టూడెంట్ రేషియోను మెయింటైన్ చేయాలని కోరారు. వారి కాళ్లపై వాళ్లను నిలబట్టడానికి అవకాశమేర్పడుతుందన్నారు. అందుకు మంత్రి లోకేశ్ సమాధానమిచ్చారు. 

"కేంద్ర ప్రభుత్వం రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఏర్పాటుచేసి, 21 రకాల దివ్యాంగుల్లో 9 రకాల వారికి స్పెషల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. వీరి కోసం రాష్ట్రంలో 679 భవిత సెంటర్లు నిర్వహిస్తున్నాం. ప్రతి సెంటర్ కు ఇద్దరు చొప్పున 1358 మంది టీచర్లు ఉన్నారు. ఈ సెంటర్లలో 41,119 మంది రిజిస్టర్ చేసుకున్నారు. 

కేంద్ర బడ్జెట్ లో కేటాయించిన నిధుల మేరకు 2025-26కు గాను ప్రతి మున్సిపాలిటీకి ఒక సెంటర్ చొప్పున మరో 125 కొత్త సెంటర్లను ప్రతిపాదించాం. నూరుశాతం మంజూరవుతాయని బలంగా నమ్ముతున్నాం. టీచర్-స్టూడెంట్ రేషియో ప్రకారం ప్రైమరీలో 1:10, సెకండరీలో 1:15 నిష్పత్తిలో ఉండాలి. సెకండరీలో రిక్రూట్ మెంట్ చేయాల్సి ఉంది. 

పిల్లలను, వారి కుటుంబాలను ఆదుకోవాలనే లక్ష్యంతో ఉన్నాం. సభ్యులతో ఒక కమిటీ వేసి కొత్త టెక్నాలజీ, టీచింగ్ పై చర్చించి నిర్ణయం తీసుకుంటాం" అని మంత్రి లోకేశ్ అసెంబ్లీలో వివరించారు.
Nara Lokesh
Children With Special Needs
AP Assembly Session

More Telugu News