MK Stalin: మాటలు జాగ్రత్త.. కేంద్ర మంత్రిపై తమిళనాడు సీఎం ఆగ్రహం

Tamilnadu CM MK Stalin Serious Warning To Central Miinister Dharmendra Pradhan
  • తమిళులను అవమానిస్తున్నారంటూ మండిపడ్డ స్టాలిన్
  • తమిళనాడులో ఎన్ఈపీని అమలు చేసేదేలేదని తేల్చిచెప్పిన సీఎం
  • లోక్ సభలో డీఎంకే ఎంపీలపై మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివాదాస్పద వ్యాఖ్యలు
  • మంత్రిపై స్పీకర్ కు ప్రివిలేజ్ మోషన్ సమర్పించిన డీఎంకే ఎంపీ కనిమొళి
కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత ధర్మేంద్ర ప్రధాన్ పై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్రంగా మండిపడ్డారు. ‘మాటలు జాగ్రత్త’ అంటూ హెచ్చరించారు. తమిళులను, తమిళ భాషను అవమానిస్తే సహించబోమంటూ ట్వీట్ చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ తనను తాను రాజులా భావించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొగరుగా మాట్లాడుతున్నారని, ఆయనకు క్రమశిక్షణ అవసరమని అన్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ఈపీ) పేరుతో హిందీని తమిళులపై రుద్దాలన్న ప్రయత్నాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదన్నారు. ఎన్ఈపీని తమిళనాడులో అమలు చేయబోమని తేల్చిచెప్పారు. లోక్ సభలో మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తమిళులను అవమానించారని మండిపడ్డారు.

కాగా, లోక్ సభలో డీఎంకే ఎంపీ కనిమొళి మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలు తనను బాధించాయని అన్నారు. ఎన్ఈపీ పాలసీపై మొదటి నుంచి డీఎంకే ఒకేమాటపై ఉందని, ఎన్ఈపీకి తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందిస్తూ.. డీఎంకే సభ్యులను కించపరచాలనేది తన ఉద్దేశం కాదని, తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని చెప్పారు. దీంతో ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అయితే, ఈ వివాదం అక్కడితో సమసిపోలేదు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పై ఎంపీ కనిమొళి స్పీకర్ కు ప్రివిలేజ్ మోషన్ అందించారు.

లోక్ సభలో ఏం జరిగిందంటే..
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లోక్ సభలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ఈపీ) కి తమిళనాడు వ్యతిరేకమని, తమపై హిందీని రుద్దవద్దని ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) ఎంపీలు సోమవారం సభలో నినాదాలు చేశారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ఆందోళన తెలిపారు. అయితే, ఎంపీల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. డీఎంకే ఎంపీలు అనాగరికులని, నిజాయతీ లేనివారని తమిళ విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్ఈపీ పాలసీని తీసుకొచ్చినపుడు తొలుత అంగీకారం తెలిపింది తమిళనాడు ప్రభుత్వమేనని, ఇప్పుడు వారు మాటమారుస్తున్నారని మంత్రి ఆరోపించారు.
MK Stalin
Dharmendra Pradhan
NEP
Tamilnadu
Tamil
Kanimozhi

More Telugu News