Canada: మీడియా ముందు కన్నీటిపర్యంతమైన జస్టిన్ ట్రూడో... వీడియో ఇదిగో!

Canada PM Justin Trudau Spotted Crying At Latest Press Conference
  • ప్రధాని బాధ్యతల నుంచి మరో రెండు రోజుల్లో తప్పుకోనున్న ట్రూడో
  • లిబరల్ పార్టీ అధ్యక్ష హోదాలో చివరి ప్రెస్ మీట్
  • అమెరికా సుంకాలపై డొనాల్డ్ ట్రంప్ కు హితవు
కెనడా ప్రధానమంత్రి బాధ్యతల నుంచి జస్టిన్ ట్రూడో మరో రెండు రోజుల్లో వైదొలగనున్నారు. దేశ ప్రజల్లో ఆయన ప్రభుత్వానికి ఆదరణ పడిపోవడంతో ట్రూడో తప్పుకుంటున్నారు. లిబరల్ పార్టీ అధ్యక్ష పదవికి ఈ వారంలో రాజీనామా చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానిగా చివరిసారి కెనడా ప్రజలను ఉద్దేశించి ట్రూడో గురువారం మాట్లాడారు. కెనడా ప్రధానిగా నిరంతరం దేశ పౌరుల ప్రయోజనాల కోసమే పనిచేశానని, ఏనాడూ ప్రజలకు తలవంపులు తెచ్చేలా వ్యవహరించలేదని ఆయన వివరించారు. కెనడా పౌరుల సంక్షేమం కోసం నిరంతరం తపన పడినట్లు తెలిపారు. 

"వ్యక్తిగతంగా కెనడా ప్రయోజనాలే తొలి ప్రాధాన్యంగా పనిచేశా. ప్రజల మద్దతుతో చివరి వరకూ మెరుగైన పాలన అందించా. మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ప్రధానిగా దేశ ప్రజలకు సేవ చేయడంపైనే దృష్టి పెట్టా. ఈ అవకాశం దక్కడం నా అదృష్టంగా భావిస్తున్నా" అంటూ ట్రూడో కన్నీటిపర్యంతమయ్యారు. 

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కెనడాపై టారిఫ్ లు విధించడాన్ని ప్రస్తావిస్తూ... కెనడా, మెక్సికోలు సంపన్నంగా ఉంటేనే ‘అమెరికా ఫస్ట్‌’ సాధ్యమవుతుందని చెప్పారు. మనలో ఏ ఒక్కరు ఓడిపోయి, మిగతా వారు గెలిచినా ఉపయోగం ఉండదన్నారు. అందరమూ విజేతలుగా నిలిస్తేనే ఆనందమని చెప్పుకొచ్చారు. కెనడాపై అమెరికా ప్రకటించిన టారిఫ్ వార్ కు తాను దీటుగా జవాబిచ్చానని, ప్రతీకార టారిఫ్ లు విధించడంతో పాటు ఇతరత్రా చర్యలు చేపడుతున్నట్లు ట్రూడో వివరించారు. కాగా, అదనపు టారిఫ్‌ల నుంచి కెనడా, మెక్సికోలకు ఓ నెల రోజుల పాటు మినహాయింపునిస్తూ ట్రంప్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై ట్రూడో నిరాశ వ్యక్తం చేశారు.
Canada
Justin Trudau
Trudo
Crying
PM Criying

More Telugu News